హెన్నీ క్రిస్టీనా కుల ధ్రువీకరణను మళ్లీ తేల్చండి

16 Nov, 2022 04:38 IST|Sakshi

గుంటూరు జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

మూడు నెలల గడువు

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పరిషత్‌ (జెడ్పీ) చైర్‌పర్సన్‌ హెన్నీ క్రిస్టీనా, ఆమె భర్త కత్తెర సురేష్‌ కుమార్‌ల కులాన్ని మరోసారి తేల్చాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. వారి కుల ధ్రువీకరణపై పిటిషనర్‌ తాజాగా సమర్పించే ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని  చెప్పింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకునే ముందు క్రిస్టీనా, సురేష్‌ల వాదన కూడా వినాలని కలెక్టర్‌కు తెలిపింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ దొనడి రమేశ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రిస్టీనా, సురేష్‌ ఎస్సీలు కారని, అయినా ఎస్సీలుగా చలామణి అవుతున్నారని, వారి కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కొల్లిపర గ్రామానికి చెందిన మండ్రు సరళకుమారి గత ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ మంగళవారం మరోసారి విచారణ జరిపారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. క్రిస్టీనా, సురేష్‌ కుమార్‌ బాప్టిజం తీసుకోవడం ద్వారా క్రైస్తవ మతంలోకి మారారని, అందువల్ల వారికి ఎస్సీ రిజర్వేషన్‌ వర్తించదని తెలిపారు. వారికిచ్చిన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలన్న పిటిషనర్‌ ఫిర్యాదును కలెక్టర్‌ తోసిపుచ్చారన్నారు. వారు బాప్టిజం తీసుకున్నట్లు అప్పట్లో ఆధారాలు దొరకలేదని, ఇప్పుడు ఆ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.  

మరిన్ని వార్తలు