‘ఈ వాచ్‌’ను వినియోగించొద్దు

6 Feb, 2021 03:31 IST|Sakshi

ఎస్‌ఈసీకి హైకోర్టు ఆదేశం

9వ తేదీ వరకు యాప్‌ను పరిశీలించండి

సెక్యూరిటీ ఆడిట్‌ సర్టిఫికెట్‌ లేకుండా ఎలా తెస్తారు?

ఎప్పుడో నియమావళి అమల్లోకి వస్తే ఇప్పుడు యాప్‌ ఎందుకు?

సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక యాప్‌లను కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఈ–వాచ్‌ పేరుతో రూపొందించిన ప్రైవేట్‌ యాప్‌ను ఈ నెల 9వ తేదీ వరకు వినియోగంలోకి తీసుకు రావొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ వాచ్‌ యాప్‌ను ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏపీటీఎస్‌ఎల్‌)  పరిశీలించవచ్చని స్పష్టం చేసింది. ఈ వాచ్‌ యాప్‌పై నిషేధం విధించి, ‘సీ విజిల్‌’, ‘నిఘా’ యాప్‌లను ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన న్యాయవాది కట్టా సుధాకర్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనలతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అంగ్రేకుల నాగేశ్వరరావు, తెనాలి మండలం బుర్రిపాళెంకు చెందిన అడుసుమల్లి అజయ్‌కుమార్‌లు వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ మూడు వ్యాజ్యాలపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

 ఆ రెండు యాప్‌లను పక్కన పెట్టేశారు.. 
‘ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ‘సీ విజిల్‌’ పేరుతో యాప్‌ను తయారు చేసింది. జీయో ట్యాగ్‌తో కూడిన ఈ యాప్‌ చాలా సౌకర్యవంతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ‘నిఘా’ యాప్‌ కూడా చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ యాప్‌లను పక్కనపెట్టి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని ఈ వాచ్‌ యాప్‌ను రూపొందించింది. ఇప్పటి వరకు సెక్యూరిటీ ఆడిట్‌ జరగలేదు. ఏపీటీఎస్‌ఎల్‌ సంస్థ ధ్రువీకరణ పత్రం ఇస్తేనే యాప్‌ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎస్‌.శరత్, వీఆర్‌ రెడ్డి కొవ్వూరి, జీఆర్‌ సుధాకర్‌.. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ వాదనలు వినిపించారు.  

ఆడిట్‌ కోసం పంపాం
ఈ వాచ్‌ యాప్‌ను రాత్రికి రాత్రే రూపొందించలేదని, వివరాలన్నింటినీ సీల్డ్‌ కవర్‌లో కోర్టు ముందు ఉంచుతామని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ చెప్పారు. ఆడిట్‌ సర్టిఫికెట్‌ కోసం ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి గురువారం ఏపీ సెక్యూరిటీ సర్వీసెస్‌కు అభ్యర్థన పంపారన్నారు. ప్రాథమిక పరిశీలనకు కనీసం ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు. 

సీల్డ్‌ కవర్‌ వ్యవహారాలు వద్దు : హైకోర్టు
– సీల్డ్‌ కవర్‌ వ్యవహారాలు వద్దు. అంత రహస్యం ఇక్కడేమీ లేదు. ఈ వాచ్‌ యాప్‌ రూపకల్పనకు ఎంత మొత్తం ఖర్చు చేశారు? కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాల యాప్‌లను ఎందుకు ఉపయోగించలేదు?
– ఎన్నికల నియమావళి జనవరి 8 నుంచి అమల్లో ఉండగా, ఇప్పుడు ఈ వాచ్‌ యాప్‌ తీసుకొచ్చి ప్రయోజనం ఏమిటి? అడిట్‌ సెక్యూరిటీ సర్టిఫికెట్‌ లేకుండా ఈ యాప్‌ను ఎలా వినియోగిస్తారు? 
– ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ వాచ్‌ యాప్‌ పరిశీలన కోసం విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నాం. అప్పటి వరకు ఈ యాప్‌ను అమల్లోకి తీసుకురావడానికి వీల్లేదు.    

మరిన్ని వార్తలు