టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో చుక్కెదురు

7 Sep, 2023 09:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర ప్రజా ప్రతిని­ధులను అసభ్యంగా దూషించినందుకు ఎమ్మెల్యే పేర్ని నాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఆత్కూ­రు పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ అయ్యన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై న్యాయ­మూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు నమో దు చేసిన ఐపీసీ సెక్షన్లు 505(2), 153ఏలు పిటి షనర్లకు వర్తించవన్నారు. అయ్యన్న­వర్గ విభేదాలను రెచ్చగొట్టేలా మాట్లాడ­లేదని, అసభ్య పదజాలం వాడలేదని అన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై మాత్రమే వ్యా­ఖ్య­లు చేశారని తెలిపారు.

న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. అలాంటి భాషా ప్రయోగం మంచిది కాదని హితవు పలికారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఉన్నతస్థానాల్లో ఉన్న వ్యక్తులను దూషించడం అయ్యన్నకు అలవాటుగా మారిందన్నారు. ఇలాంటి వారి విషయంలో కోర్టులు తగిన విధంగా స్పందించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పిటిషనర్‌ అయ్యన్నకి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.
చదవండి: ఎక్కడి దొంగలు.. అక్కడే! 

మరిన్ని వార్తలు