ఉన్నత విద్యలో ఏపీ ఆదర్శం

5 Mar, 2023 04:31 IST|Sakshi

జీఐఎస్‌లో విద్యారంగ నిపుణుల వెల్లడి

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో అమలు చేస్తున్న విద్యా విధానం పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని విద్యా రంగ నిపుణులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు ప్రశంసనీయమని చెప్పారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వం ముందుందని తెలిపారు.  విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)లో రెండో రోజు శనివారం ఉన్నత విద్యపై ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి అధ్యక్షతన ప్యానల్‌ చర్చ జరిగింది.

‘ఇంపాక్ట్‌ ఆఫ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ అనే అంశంపై విద్యా రంగ నిపుణులు చర్చించారు. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ వృత్తి నైపుణ్య కేంద్రంగా మారిందని చెప్పారు.  నాస్కాం, మైక్రోసాఫ్ట్, స్కిల్‌ ఫోర్స్, టీం లీడ్స్, టీసీఎస్‌ వంటి కంపెనీలతో ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఒప్పందాలు కుదుర్చుకుంటోందన్నారు. ఇంజినీరింగ్, ప్రొఫెషనల్, డిగ్రీ, ఫార్మసీ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌­డ్‌ ఎమర్జింగ్‌ టెక్నాల­జీస్‌ కోర్సులను అందిస్తూ ఉద్యోగ కల్పనలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని వివరించారు. 

ఏపీలో విద్యా విధానం భేష్‌
విట్‌ ఫౌండర్, చాన్సలర్‌ జి.విశ్వనాథన్‌ మాట్లా­డు­తూ ఏపీలో ఉన్నత విద్యా బోధన, విధానం చాలా బాగున్నాయని, ప్రభుత్వం దీనిపై అధిక శ్రద్ధ పెట్టిందని చెప్పారు. ఏఐసీటీఈ సీవోవో బుద్దా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఫీజు రీయింబర్స్‌­మెం­ట్‌ సదుపాయాన్ని కల్పించడం వల్ల చాలా కుటుంబాల్లో ఇంజినీర్లు తయారవుతు­న్నారని చెప్పారు.  చర్చలో ఐఐఎస్‌సీ (బెంగళూరు) ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్, ఐఐటీ హైదరాబాద్‌ ఫౌండర్‌ ఉదయ్‌ దేశాయ్, ఐఐఎం విశాఖ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు