‘పవన్‌,..2019లో అమరావతి కుల రాజధాని అని నువ్వు అనలేదా?’

2 Oct, 2023 15:47 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్టు పట్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని పండుగ చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులపై ఎన్నో అరాచకాలు చేశారని అలాంటి వ్యక్తికి కొమ్ము కాస్తున్నందుకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఇద్దరికీ కలిపి బుద్ధి చెబుతారన్నారు.      

అడపా శేషు మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్ట్ చేసి ఇప్పటికి 24 రోజులైందని ప్రజల్లో ఆయన పట్ల ఎలాంటివో సానుభూతి లేదని పైగా వారంతా చంద్రబాబు అరెస్ట్ పట్ల చాలా ఆనందంగా ఉండడమే కాకుండా పండుగ వాతావరణంలో ఉన్నారన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కులాలను, మతాలను ఆయన ఇబ్బంది పెట్టారన్నారు. కాపు ఉద్యమం సందర్బంగా ముద్రగడ పద్మనాభంపై అనేక తప్పుడు కేసులు పెట్టారని, వంగవీటి రంగా హత్యకు కూడా చంద్రబాబే కుట్రదారుడన్నారు. 

పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ముగ్గురూ వారి యాత్రల్లో చాలా అసభ్యంగా మాట్లాడారని ప్రజలను పదే పదే రెచ్చగొట్టారని అన్నారు. 2014లో పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరీ కాపులతో టిడిపికి ఓట్లు వేయించారు. ఆనాడు చంద్రబాబు ప్రజలకు 600 హామీలిచ్చి గద్దెనెక్కారు. అలాంటిది 2019లో అమరావతి కుల రాజధాని అని పవన్ అన్న మాటలను గుర్తు చేశారు. 

పవన్ కళ్యాణ్ వైసీపీలో కాపులు తనని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు కాబట్టి ఆయనకు నాదొక సూటి ప్రశ్న.. నువ్వు కూడా వైసీపీలోని కేవలం కాపు ఎమ్మెల్యేలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నావని.. కాపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నించారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జన సైనికులకు నువ్వు ఏం చేశావని వచ్చే ఎన్నికల్లో జన సైనికులు, కాపులు నీకు ఎందుకు సహకరిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు పెట్టే స్కీములన్నీ పెత్తందారులకోసమేనని, అసలు చంద్రబాబు పేదల కోసం ఆలోచించడం ఒక్కసారైనా చూసావా అని నిలదీశారు. 

హైటెక్ సిటీ పక్కన భూములు కొన్నది టీడీపీ నేతలేనని, కాపులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు మీటింగ్‌లు పెట్టిస్తున్నారన్నారు. కాపులు రాజకీయంగా ఎదగకూడదన్నది టీడీపీ కుట్రని అందుకే పవన్ కల్యాణ్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ జనసేన కలిసిన తర్వాత జరిగిన మొట్ట మొదటి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని చంద్రబాబు అరెస్ట్ పై ఆయన కుటుంబ సభ్యుల కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా బాధ పడుతున్నారని చంద్రబాబు కాళ్ళకు చెప్పుల మాదిరిగా పవన్ తయారయ్యారన్నారు. 

మీ నాన్నే నన్నేమీ పీకలేకపోయాడన్న చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని, ఇప్పుడు వీరిద్దరూ కలిసి రాష్ట్రాభివృద్ధిని నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. వీరికి అధికారం కట్టబెడితే ఇక్కడి సంపదను దోచుకెళ్ళి ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ పెట్టుబడులు పెడతారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని అన్నారు. 

ఇది కూడా చదవండి: పద్మనాభం పీఎస్‌ ఘటన.. ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు

మరిన్ని వార్తలు