3 కారిడార్లు దక్కించుకున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు

29 Oct, 2020 20:05 IST|Sakshi

ఏడీబీ రుణంతో శరవేగంగా మూడు క్లస్టర్ల పనులు

నిక్‌డిట్‌ నిధులతో నాలుగు క్లస్టర్ల అభివృద్ధి

కొత్తగా బెంగళూరు-హైదరాబాద్‌ కారిడార్‌లో ఓర్వకల్లు క్లస్టరు

రాష్ట్ర పారిశ్రామిక ప్రగతినే మార్చనున్న మూడు కారిడార్లు

సాక్షి, అమరావతి: పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. మౌలిక వసతులు కల్పించడం ద్వారా పరిశ్రమలను ఆకర్షించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూచనల మేరకు భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణంపై దృష్టి సారించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం నుంచి ఇప్పటికే విశాఖ-చెన్నై కారిడార్‌, చెన్నై-బెంగళూరు కారిడార్లు వెళ్తుండగా తాజాగా హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో మూడు పారిశ్రామిక కారిడార్లు దక్కించుకున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. ఈ కారిడార్లలో మొత్తం 8 క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (నిక్‌డిట్‌) నుంచి భారీగా నిధులను తీసుకురావడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. చదవండి: భీమిలి భోగాపురం మధ్య.. పారిశ్రామిక కారిడార్‌ 

ఏడీబీ నిధులు రూ.4,598 కోట్లతో విశాఖ-చెన్నై కారిడార్‌:
విశాఖ-చెన్నై కారిడార్‌ను ఏడీబీ(ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌) రుణ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. తొలిదశలో విశాఖలో అచ్యుతాపురం-రాంబిల్లి, నక్కపల్లి క్లస్టర్లు, చిత్తూరు జిల్లాలో ఏర్పేడు-శ్రీకాళహస్తి క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్లస్టర్లలో మౌలిక వసతులకు సంబంధించి రూ.4,598 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. భూ సేకరణ పనుల కోసం రూ.165 కోట్ల అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కారిడార్‌లో భాగంగానే మెడ్‌టెక్‌ జోన్‌ రెండో దశ పనులను రూ.110కోట్లతో చేపడుతున్నారు. చదవండి: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం: పోస్కో 

నిక్‌డిట్‌ నిధులతో అభివృద్ధి చేస్తున్న క్లస్టర్లు:
కొప్పర్తి: తొలిదశలో 4 వేల ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని సోమశిల ప్రాజెక్టు నుంచి తీసుకురావడానికి ప్రభుత్వం డీపీఆర్‌ తయారు చేస్తోంది. 
కృష్ణపట్నం: 2,500 ఎకరాల్లో సుమారు రూ.1,500 కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.
శ్రీకాళహస్తి: ఈ క్లస్టర్‌ను నిక్‌డిట్‌ నిధులతో 8వేల ఎకరాల్లో, ఏడీబీ నిధులతో 2,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు.
నక్కపల్లి: విశాఖ-చెన్నై కారిడార్‌లో భాగంగా ఈ కస్టర్‌ను ఏడీబీ నిధులతో వేయి ఎకరాలు, నిక్‌డిట్‌ నిధులతో 3 వేల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నారు. వీటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్లస్టర్లతో పాటు 7వేల ఎకరాల్లో ​‍ప్రకాశం జిల్లా దొనకొండ నిమ్జ్‌ (నేషనల్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌)ను అభివృద్ధి చేయనున్నారు. 
ఓర్వకల్లు: హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో క్లస్టర్‌ను తాజాగా అభివృద్ధి చేయనున్నారు. దీన్ని కూడా నిక్‌డిట్‌ నిధులతో చేపట్టడానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. సుమారు 7వేల ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేస్తోంది.

మౌలిక వసతులపైనే దృష్టి
సీఐఐ, ఐఎస్‌బీ, అసోచామ్‌ వంటి పెద్ద సంస్థల నుంచి వచ్చిన సూచనల మేరకే మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నాం. ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌, డిఫెన్స్‌, ఆటోమొబైల్‌ వంటి కీలక రంగాల వారీగా క్లస్టర్లను అభిృవృద్ధి చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పారిశ్రామిక పార్కుల పనులను శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించాం.
- మేకపాటి గౌతమ్‌ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు