ఆన్‌లైన్‌లోనూ ‘ఆప్కో’ ట్రెండ్‌ 

16 Feb, 2022 04:26 IST|Sakshi

అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్‌ వంటి 7 ఈ కామర్స్‌ సంస్థల ద్వారా విక్రయాలు 

10 నెలల్లో రూ.40 లక్షల అమ్మకాలు   

సాక్షి, అమరావతి: చేనేత వస్త్రాలకు చేయూతనిస్తున్న ఆప్కో మార్కెట్‌ పోటీలోనూ తగ్గేదే లేదంటోది. 7 ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆన్‌లైన్‌ మార్కెట్‌లోనూ బ్రాండ్‌ బాజా మోగిస్తోంది. చేనేత వస్త్రాల విక్రయాలను మరింత విస్తృతం చేసేందుకు ఆప్కో హ్యాండ్‌లూమ్స్‌.కామ్‌ (apcohandlooms. com) వెబ్‌సైట్‌ను గత ఏడాది అక్టోబర్‌ 20న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అప్పటి నుంచి ఆప్కో ఆన్‌లైన్‌ విక్రయాలను చేపట్టింది. అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, గోకూప్, లూమ్‌ఫ్లోక్స్, మిర్రావ్, పేటీఎం ద్వారా ఆన్‌లైన్‌ అమ్మకాలు జరుపుతోంది. 2020 అక్టోబర్‌ నుంచి 2021 మార్చి వరకు రూ.19,13,554 విలువైన చేనేత వస్త్రాలను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించగా.. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 జనవరి 15 వరకు రూ.40,74,129 విలువైన వస్త్రాలను విక్రయించింది. 

ట్రెండ్‌కు అనుగుణంగా చేనేత వస్త్రాలు 
ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా చేనేత వస్త్రాలను రూపొందిస్తూ ఆప్కోకు ఆదరణ పెంచుతున్నామన్నారు. ఈ ఏడాది రూ.300 కోట్ల మేర టర్నోవర్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఉన్న షోరూమ్‌లతోపాటు ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో మెగా షోరూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  

మరిన్ని వార్తలు