వెల్‌డన్‌ ‘వెదర్‌మ్యాన్‌’!

26 Jul, 2021 03:32 IST|Sakshi

‘ఆంధ్రప్రదేశ్‌ వెదర్‌మ్యాన్‌’ పేరుతో ఏడేళ్లుగా వాతావరణ సూచనలు

ప్రధాని, ఐరాస, ఐఎండీ నుంచి అభినందనలు

యూనివర్సిటీ క్యాంపస్‌ (చిత్తూరు జిల్లా): తిరుపతికి చెందిన యువకుడు సాయిప్రణీత్‌ ‘ఆంధ్రప్రదేశ్‌ వెదర్‌మ్యాన్‌’ పేరిట కచ్చితమైన వాతావరణ సూచనలు అందిస్తూ రైతులకు దోహదపడుతున్నాడు. వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయినా వివిధ వెబ్‌సైట్లు, వివిధ ప్రోగ్రామ్‌ల ద్వారా వాతావరణాన్ని విశ్లేషించి అన్నదాతలకు సేవలందిస్తున్నాడు. సాయి ప్రణీత్‌ నేపథ్యం ఇదీ..

సాధారణ కుటుంబం
తిరుపతిలోని గాయత్రి నగర్‌లో నివాసం ఉంటున్న సాయిప్రణీత్‌ తండ్రి వెంకట సుబ్రమణ్యం ఇన్సూరెన్స్‌ సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి భువనేశ్వరి ఎస్వీయూ క్యాంపస్‌లోని యూనియన్‌ బ్యాంకులో ఉద్యోగి. సాయిప్రణీత్‌ చెన్నైలో జన్మించాడు. తిరుపతిలో ఇంటర్‌ పూర్తి చేసి, చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తి చేశాడు. అనంతరం గేట్‌ ప్రవేశ పరీక్ష రాసి ఎస్వీయూ ఈఈఈ విభాగంలో ఎంటెక్‌ లో చేరాడు. ఈ సమయంలో ఒక ప్రముఖ సంస్థలో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం బెంగళూరులోని ఆ సంస్థలో పనిచేస్తున్నాడు. 

వాతావరణం అంటే ఇష్టం..
సాయి ప్రణీత్‌కు చిన్నప్పటి నుంచి వాతావరణం అంటే ఎంతో ఇష్టం. తాను బీటెక్‌ చదివే సమయంలో ఖాళీ సమయంలో వాతావరణానికి సంబంధించిన జర్నల్స్, వ్యాసాలు, పుస్తకాలు చదవడం నేర్చుకున్నాడు. వివిధ రకాల డేటా సోర్స్‌ ఉపయోగించుకొని విశ్లేషణలు చేసి వాతావరణ మార్పులను కచ్చితత్వంతో అంచనా వేస్తూవచ్చాడు. ఏడాది క్రితం ‘ఆంధ్రప్రదేశ్‌ వెదర్‌మ్యాన్‌’ పేరిట బ్లాగ్‌ పేజీ రూపొందించి సామాజిక మాధ్యమాల్లో వాతవరణ మార్పులు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ పోస్టులు పెట్టేవాడు. ఈయన చెప్పిన సూచనలు, అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉంటుండడంతో సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్‌ పెరిగారు. ఫేస్‌బుక్‌ పేజీని 26 వేల మంది, ట్విట్టర్‌లో 11 వేల మంది అనుసరిస్తున్నారు. వాతావరణంలో మార్పులను ఎప్పటికప్పుడు అందిస్తూ రైతులను చైతన్యపరుస్తున్నాడు. ఇంతకుముందే ఐఎండీ, ఐరాస నుంచి ప్రశంసలు పొందాడు. తాజాగా ప్రధాని నుంచి ప్రశంసలు రావడంతో తండ్రి వెంకటసుబ్రమణ్యం, తల్లి భువనేశ్వరి, సోదరి లక్ష్మీప్రత్యూష హర్షం వ్యక్తం చేశారు.

ఎంతో సంతోషం
ఆంధ్రప్రదేశ్‌ వెదర్‌మ్యాన్‌ పేరిట నేను అందిస్తున్న వాతావరణ సేవలను ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ప్రస్తావించడం, ప్రశంసించడం ఎంతో సంతోషంగా ఉంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నాకు తక్కువ సమయం దొరుకుతుంది. అయితే, ఉన్న సమయంలోనే రైతులకు సహకారం అందించాలన్న లక్ష్యంతో కచ్చితమైన వాతావరణ సేవలను అందిస్తున్నాను. భవిష్యత్‌లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాను. 
– సాయిప్రణీత్, ఆంధ్రప్రదేశ్‌ వెదర్‌మ్యాన్‌ 

మరిన్ని వార్తలు