అధిక ఉష్ణోగ్రతలతో ఆక్వా రంగం ఉక్కిరిబిక్కిరి

25 May, 2023 05:17 IST|Sakshi

తలెత్తనున్న నీటి కాలుష్యం, ఆక్సిజన్‌ లేమి

చేపలకు చెడ్డ కాలం

రైతుల్లో ఆందోళన 

నేటి నుంచి రోహిణికార్తె 

కైకలూరు: ఆక్వా రంగాన్ని అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు రోహిణికార్తెతో గురువారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. చేపలు శీతల జలాచరాలు. వీటికి అనుకూల స్థాయి నీటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేట్‌ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేట్‌ మధ్య ఉంటాయి. ఇటీవల జిల్లాలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెంటీగ్రేట్‌ వరకు పెరిగాయి. ఈ పరిణామం చేపల, రొయ్యల రైతులను కలవరపెడుతోంది. చెరువుల్లో నీరు ఆవిరవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఆక్సిజన్‌ లేమి, నీటి కాలుష్యం, విషవాయువుల ఉత్పతి వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 

2.60 లక్షల ఎకరాల్లో సాగు
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో చేపలు, 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి చెరువుల్లో ఆక్సిజన్‌ సమస్యత తలెత్తుతోంది. సేంద్రియ పదార్థాలు చెరువు అడుగు భాగానికి చేరి విషతుల్యమవుతున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లో కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. చేపల్లో శ్వాసక్రియ సమస్య ఏర్పడి ముట్టెలు పైకెత్తి మృత్యువాతపడుతున్నాయి. వేసవిలో మూడు అడుగుల కంటే నీటిమట్టం తక్కువ ఉన్న చెరువుల్లో చేపల మరణాలు అధికమవుతాయి. 

సమ్మర్‌ కిల్‌ 
ఎండాకాలంలో వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల చేపలు చనిపోవడాన్ని సమ్మర్‌ కిల్‌ అంటారు. వేసవిలో సూర్యరశ్మి వల్ల చెరువుపై భాగంలో రెండడుగుల మేర నీరు వేడెక్కుతోంది. వేడి నీరు తేలికగా ఉంటుంది. అడుగు భాగాన చల్లగా ఉన్న నీరు బరువుగా ఉంటుంది. సమ్మర్‌ కిల్‌కి దారితీసే ప్రధాన అంశం ఇదే. చెరువుల్లో భౌతిక, రసాయన గుణాలున్న నీటి ఉష్ణోగ్రత, ప్లాంక్టాన్, ఆక్సిజన్, ఉదజని సూచిక విలువలు, కార్బన్‌ డయాక్సైడ్, అమ్మోనియా వంటి హానికర వాయువులు వివిధ లోతులలో వివిధ స్థాయిల్లో ఉంటాయి. నీటి ఉపరితలం నుంచి అడుక్కు వెళ్లే కొలదీ నీటి ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోతాయి. దీంతో చేపలు మృత్యువాత పడతాయి. 

నీటి పరీక్షలు చేయించాలి 
వేసవిలో ఉష్ణోగ్రతల ప్రభావం చేపల సాగుపై పడుతోంది. ప్రధానంగా ఆక్సిజన్‌ సమస్య ఉత్పన్నమవుతోంది. రైతులు ఆక్సిజన్‌ మాత్రలను అందుబాటులో ఉంచుకోవాలి. నీటి పరీక్షలు తరచుగా చేయించాలి. పీహెచ్‌ విలువలు తెలుసుకోవాలి. ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మత్స్యశాఖ సహాయకులను నియమించింది. అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి.  – ఎం.భవిత,  మత్స్యశాఖ అభివృద్ధి అధికారిణి, కైకలూరు

వేసవి వ్యాధులతో జాగ్రత్త 
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగటంతో ఆక్సిజన్‌ సమస్య చెరువుల్లో కనిపిస్తోంది. దీంతో చేపలకు శంఖుజలగ, రెడ్‌ డిసీజ్, పేను వంటి వ్యాధులు ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కోళ్ల ఎరువులను వేసవిలో మానివేయాలి. రొయ్యల చెరువుల మాదిరిగా చేపల చెరువుల్లోనూ ఆక్సిజన్‌ ఏరియాటర్లను ఏర్పాటు చేసుకోవాలి. – దండు రంగరాజు,  ఆక్వారైతు, కైకలూరు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చెరువులో మూడు అడుగులు లోతులో నీరు తగ్గకుండా చేయాలి.
 చేపల చెరువులో ఆక్సిజన్‌ సమస్య పరిష్కారానికి తెల్లవారుజామున మూడు నుంచి ఆరు గంటల వరకు నీటిని కలయతిప్పుతూ ఉండాలి.
చెరువుల్లో కూడా ఆక్సిజన్‌ ఉత్పిత్తి చేసే ఏరియాటర్లును ఉపయోగించాలి.
జియోలైట్, కాల్షియం పెరాక్సైడ్, ఆక్సిజన్‌ డబ్లెట్లు వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. 
చెరువుల్లో మేతలను సగానికి తగ్గించుకోవాలి. 
చెరువుల్లో పాతనీటి స్థానంలో అవకాశాన్ని బట్టి కొత్త నీటిని నింపుకోవాలి.
చెరువుపై పక్షులు ఎక్కువుగా సంచరిస్తుంటే ఎక్కడైనా చేపల మరణించాయా అనే విషయాన్ని గమనించాలి. 
ఆక్సిజన్‌ సమస్యను అధికమించడానికి చెరువులో నీటిని యంత్రాల ద్వారా తిరిగే అదే చెరువులోకి నింపే పద్ధతిని అనుసరించవచ్చు. 
చెరువులో నీటి, మట్టి పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించాలి.

మరిన్ని వార్తలు