చలికాలంలో భగభగలు

13 Oct, 2023 04:25 IST|Sakshi

సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు

మరో వారం పాటు ఇదే తరహా వాతావరణం

వాతావరణ శాఖ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భగభగమంటున్నాయి. సాధారణంగా చలికాలంలో క్రమంగా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు వేసవి కాలం మాదిరి నమోదవుతున్నాయి. ప్రస్తుతం నైరుతి సీజన్‌ ముగిసి, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. ఇంకా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనప్పటికీ సాధారణంగా ఈపాటికి వాతావరణం చల్లబడుతుంది.

కానీ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలను మించిపోతున్నాయి. సగటున 3–5 డిగ్రీ సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో రాష్ట్రంలో వాతావరణం వేసవి సీజన్‌ను తలపిస్తోంది. వాతావరణంలో తేమ తగ్గడంతో ఉక్కపోత పెరుగుతుండగా.. ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉంటుండటంతో ఉష్ణోగ్రతలు సైతం అధికంగా నమోదవుతున్నాయి.

మరో వారం ఇంతే...
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగిసినప్పటికీ... తిరోగమన ప్రక్రియ చివరి దశలో ఉంది. మరో మూడు రోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత వారం రోజులకు ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో వాతావరణంలో మార్పులు ఉంటాయని, దీంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.

గురువారం రాష్ట్రంలో నమోదైన ఉషోగ్రతలను పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36.2 డిగ్రీ సెల్సియస్‌ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత అత్యల్పంగా మెదక్‌లో 18.3 డిగ్రీలుగా నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు చాలాచోట్ల సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. ఖమ్మం జిల్లాలో సాధారణం కంటే 4.6 డిగ్రీలు అధికంగా నమోదు కాగా, భద్రాచలంలో 3.5 డిగ్రీలు, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, హనుమకొండలో 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడివాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తలు