అరకు కాఫీ రుచి చూసిన జి 20 సమ్మిట్‌ 

13 Sep, 2023 03:14 IST|Sakshi

అంతర్జాతీయంగా మరోసారి ప్రాధాన్యం 

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అరకు కాఫీకి మరోసారి అరుదైన ప్రాధాన్యత దక్కింది. న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమ్మిట్‌లో అరకు వ్యాలీ కాఫీ ప్రదర్శనకు అవకాశం రావడమే ఇందుకు కారణం. సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ఎగ్జిబిషన్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన రైతులు పండించిన, ప్రత్యేకమైన, అధిక నాణ్యత ప్రమాణాలు కల్గిన కాఫీని ప్రదర్శించడం గమనార్హం.

ఈ గ్లోబల్‌ ఈవెంట్‌లో అరకు వ్యాలీ కాఫీ ప్రదర్శన ద్వారా ప్రీమియం కాఫీ బ్రాండ్‌గా మాత్రమే కాకుండా వాణిజ్య పరంగా సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుందని జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి సాక్షికి తెలిపారు.  జి20 శిఖరాగ్ర సమావేశాలకు వచ్చిన పలు దేశాల ప్రతినిధులకు అరకు కాఫీ రుచిని పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. జీసీసీకి ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శోభా స్వాతిరాణి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేష్  కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.  కాగా అతిథులకు ఇచ్చే బహుమతుల్లో అరకు కాఫీని సైతం అందజేయడం విశేషం.

మరిన్ని వార్తలు