సేవల్లో వేగం.. తగ్గనున్న పనిభారం

17 Jun, 2021 04:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య రంగంలో ఆశా వర్కర్లు అత్యంత కీలకం. పట్టణాలు, గ్రామాల్లో నిర్దిష్ట జనాభా పరిధిలో వారు సేవలు అందిస్తున్నారు. ఫీవర్‌ సర్వేలు, టీబీ సర్వేలు మొదలుకొని, గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు, ఇతర ప్రజానీకం ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలు వేయడం వరకు ఆశా వర్కర్లదే బాధ్యత. వీరి సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వారి వేతనాలను రూ. 3వేల నుంచి ఏకంగా రూ. 10వేలకు పెంచారు. బకాయిలు లేకుండా ప్రతి నెలా వారి ఖాతాల్లో వేతనాలు జమ అవుతున్నాయి. తాజాగా కోవిడ్‌ సమయంలోనూ వారు సమర్థంగా సేవలు అందించారు. ఈ నేపథ్యంలో వారి పనిని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ‘స్మార్ట్‌’గా ఆలోచించింది. ఇప్పటివరకు ఆశా వర్కర్లు సర్వేల సమయంలో మాన్యువల్‌ విధానంలో అంటే.. ప్రశ్నావళిని అడిగి పేపర్లలో రాసుకునేవారు. దీనికోసం ఒక్కో ఇంటివద్దే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చేది.  సేకరించిన సమాచారం కంప్యూటర్‌లో నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపడం మరో జాప్యం. ఇకపై ఇవన్నీ ఉండవు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40వేల మంది ఆశా వర్కర్లకు సర్కారు త్వరలోనే స్మార్ట్‌ ఫోన్‌లు ఇవ్వనుంది. దీనిద్వారా వారిని డిజిటల్‌ సేవలవైవు నడిపిస్తున్నారు. సేవల్లో వేగం పెరగడంతో పాటు ఆశావర్కర్లకు పనిభారమూ తగ్గనుంది. 

తెలుగులోనే యాప్‌.. 
ఆశా వర్కర్లకు మొబైల్‌ కొనుగోళ్లకు సుమారు రూ. 25 కోట్లకు పైనే వ్యయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ ఆరోగ్యమిషన్‌ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఫోన్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే టెండరు పూర్తయి, కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చారు. జూలైలో ఇవి అందరికీ సరఫరా చేయాలన్నది లక్ష్యం. ఆశా వర్కర్లు పదవ తరగతి, అంతకంటే తక్కువ చదివిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి తెలుగులోనే యాప్‌ను తయారు చేశారు. అలాగే పిక్టోరియల్‌ (చిత్రాలతో కూడిన) యాప్‌ కూడా ఉంటుంది. జనం సమస్యలు తెలుసుకుని ఆశా వర్కర్లు యాప్‌లో నమోదు చేయగానే.. ఆ సమాచారాన్ని జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర అధికారుల వరకూ ఎవరైనా చూసుకునే వీలుంటుంది. ఉదాహరణకు ఒక హైరిస్క్‌ ప్రెగ్నెంట్‌ ఉమెన్‌ గురించి వివరాలు నమోదు చేసినప్పుడు సంబంధిత విభాగాధికారికి సమాచారం వేగంగా వెళ్తుంది.  వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం ఆశా వర్కర్లకు స్మార్ట్‌ఫోన్, యాప్‌ల వాడకంపై శిక్షణ ఇవ్వనున్నారు.

సేకరణ సులువవుతుంది 
ఆశాలకు ఇచ్చే స్మార్ట్‌ఫోన్‌లో తెలుగులోనే యాప్‌ ఉంటుంది. బొమ్మలు ఉంటాయి. దీంతో సులభంగా వివరాల నమోదుకు అవకాశం ఉంటుంది. గతంలోలాగా ఆశా వర్కర్లు ప్రశ్నావళితో కుస్తీపట్టాల్సిన అవసరం ఉండదు. జూలై నెలాఖరుకు ఫోన్‌లు అందజేసి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 
– కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ  

>
మరిన్ని వార్తలు