ఆరోగ్యం మీ హక్కు!

5 Dec, 2023 04:43 IST|Sakshi

అందరికీ అవగాహన కల్పిస్తూ 18 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

జనవరి 1 నుంచి రెండో దశ జగనన్న ఆరోగ్య సురక్ష 

దిశ మాదిరిగానే ప్రతి ఒక్కరి మొబైల్‌లో ఆరోగ్యశ్రీ యాప్‌ 

జగనన్న ఆరోగ్య సురక్షలో గుర్తించిన రోగులకు సకాలంలో మందులు 

కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్, ఏఎన్‌ఎం, ఆశావర్కర్ల ద్వారా నిర్వహణ

ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులూ ఇందులో భాగస్వాములు

వైద్యం కోసం పేదలు చేతి నుంచి డబ్బు ఖర్చుపెట్టకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్య రంగంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఈ విషయంలో సంతృప్తి కరంగా సేవలందించేలా అడుగులు వేస్తోంది. పేదలందరికీ ఆరోగ్యం అనేది హక్కు­గా ఉండాలన్న లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌ క్లినిక్స్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా రోగులను చేయి పట్టుకుని నడిపిస్తూ వారికి నాణ్యమైన సేవలతోపాటు మందుల నుంచి చికిత్స వరకు అందించే బాధ్యతను భుజానకెత్తుకుంది. గతంలో చికిత్స పొందిన వారి ఆరోగ్యంపట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసు ­కుంటూనే మందుల విషయంలో రాజీపడ­కుండా ఎంత ఖరీదైనవి అయినా సరే వారికి అందించాలన్న కృతనిశ్చయంతో ఉంది. 

ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏ పేద­వాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదని.. ఈ విషయంలో వాళ్లు అప్పులపాలు కాకుండా ఉండేందుకు వీలుగా ఆరోగ్యశ్రీని ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా బలోపేతం చేసింది. ఈ విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మరో అడుగు ముందుకేస్తూ ప్రజలు నచ్చేలా.. ప్రభుత్వాన్ని మెచ్చేలా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతీ ఒక్కరికీ విస్తృతంగా అవగాహన కల్పించాలని సంకల్పించారు. సేవలు వినియోగించడం గురించి తెలియని వ్యక్తి అంటూ రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది.

ఇందుకోసం.. కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ల ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్నారు. మొత్తం 1,42,34,464 కొత్త కార్డులను ప్రింట్‌ చేయిస్తున్నారు. ఈనెల 18 నుంచి వీటిని అందజేస్తారు. మరోవైపు.. ఆరోగ్యశ్రీ యాప్‌ ప్రతి ఒక్కరి మొబైల్‌ ఫోన్‌లో అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదే సమయంలో దిశ యాప్‌ కూడా డౌన్‌లోడ్‌ చేసుకునేలా కార్యక్రమం చేపడుతోంది. ప్రతి ఒక్కరి మొబైల్‌ ఫోన్‌లో ఈ రెండు యాప్‌లు ఉండేలా చర్యలు తీసుకుంటోంది.

ఆరోగ్య సురక్షపై నిరంతర సమీక్ష
మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా యజ్ఞంలా సాగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూతనందించే కార్యక్రమాన్ని నిరంతరం సమీక్షించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టనుంది. అందులో మొదటిది.. 

► సురక్షలో గుర్తించిన రోగులకు మందులు అందించడం, కాలానుగుణంగా ఆరోగ్యంపై ఫాలోఅప్‌ చేయడం..
► రెండోది.. గతంలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసుకున్న వారికి అవసరమైన మందులు, చికిత్సపై ఫాలోఅప్‌ సేవలు అందించడం..
► మూడోది.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అందిస్తున్న మందులను కోర్సు ముగిసేలోపే వాటిని అందుబాటులో ఉంచడం. ఈ మూడు ప్రధాన అంశాలపై నిరంతరం సమీక్ష చేయనుంది.
► అలాగే, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మందులపై ప్రత్యేక శ్రద్ధ..
ఇక ఫ్యామిలీ డాక్టర్‌ ప్రతి గ్రామానికీ వెళ్తున్నందున అదే సమయంలో వారికి మందులు అందాయా? లేదా? అన్న దానిపైనా దృష్టి కేంద్రీకరించనుంది. ఈ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. అలాగే, సురక్షలో గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స అవసరమున్న రోగులకు రవాణా ఖర్చుల కింద రూ.500 చొప్పున ఇవ్వడమే కాక.. సురక్ష క్యాంపుల నుంచి ఆస్పత్రులకు రిఫర్‌ చేసి నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్లుగా చేరిన వారిని మరోసారి డాక్టర్ల బృందం పరిశీలించేలా.. శిబిరాల్లో ఇంకా వైద్యం అందాల్సిన వారికి వెంటనే నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోనుంది.

చైనా వైరస్‌పైనా అప్రమత్తం
చైనాలో హెచ్‌9ఎన్‌2 వైరస్‌ విస్తరిస్తున్న దృష్ట్యా మన దగ్గర ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖను సీఎం జగన్‌ అప్రమత్తం చేశారు. ఆస్పత్రుల వారీగా ఉన్న మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. మందులు, ఆక్సిజన్, పడకల విషయంలో అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో ఎక్కడా వైద్యులు, సిబ్బంది పోస్టుల ఖాళీలు లేకుండా చూడాలని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం వైద్య, ఆరోగ్య శాఖపై  ముఖ్యమంత్రి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సూచించారు.

1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ..
అంతకుముందు.. వైద్యశాఖలో అమలుపరుస్తున్న పలు కార్యక్రమాల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు నెలాఖరు వరకూ 12,42,118 మంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించుకున్నట్లు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే 24.64 శాతం చికిత్సలు పెరిగాయన్నారు. అలాగే.. ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి మొబైల్‌ ఫోన్‌లో అందుబాటులో ఉంచేలా చూస్తున్నామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు, పురోగతిని కూడా వారు సీఎంకు వివరించారు. 

► కంటి చికిత్సలు కాకుండా ఇతర వైద్య చికిత్సలు అవసరమైన వారు 86,690 మంది ఉన్నారని.. 
► ఇందులో 73,602 మందికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్సలు అందేలా చర్యలు తీసుకున్నామని..
► చాలామందికి పరీక్షలు చేసిన తర్వాత వైద్యులు మందులు ఇచ్చారని.. అనంతరం తదుపరి చికిత్స కోసం 16,128 మందిని ఆస్పత్రుల్లో అడ్మిట్‌ చేశామని చెప్పారు.
► వీరిలో 15,786 మందికి సర్జరీలు, ట్రీట్‌మెంట్లు పూర్తయ్యాయి.
► 78,292 మందికి కంటిచికిత్సలు అవసరమని జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా గుర్తించామని అధికారులు వివరించారు. 
► ఇక కంటిచూపు సంబంధిత సమస్యలున్న 13,614 మందికి ఇప్పటికే కేటరాక్ట్‌ సర్జరీలు చేయించామన్నారు. 5,26,702 మందికి కంటి అద్దాలు అందిస్తున్నామన్నారు. 
► క్యాంపుల్లో గుర్తించిన రోగులకు సకాలంలో మందులు అందేలా అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. 

జనవరి నుంచి రెండోదశ ఆరోగ్య సురక్ష..
ఇక జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మండలంలో ప్రతీవారం ఒక ఆరోగ్య సురక్ష క్యాంపు ఏర్పాటుచేసేలా ప్రణాళిక రచించామన్నారు. క్యాంపుల్లో స్పెషలిస్ట్‌ వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని.. మందులు, వైద్య పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఇలా 110 మున్సిపాలిటీల్లోని పట్టణ, నగర ప్రాంతాలను కవర్‌ చేస్తూ వారంలో 162 క్యాంపులు ఉంటాయన్నారు.  

ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్‌ జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్‌ మంజుల, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ నివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, సెకండరీ హెల్త్‌ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్‌ నరసింహం, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌. గుల్జార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు