‘అసైన్డ్‌’ రైతులకు యాజమాన్య హక్కులు

26 Sep, 2023 03:39 IST|Sakshi

20ఏళ్లు దాటిన అసైన్డ్‌ భూ యజమానులకు సంపూర్ణ హక్కులు

పదేళ్లు దాటిన ప్రభుత్వ ఇళ్ల పట్టాల బదిలీకి చట్ట సవరణ

ఏపీ భూదాన్‌ బోర్డు ఏర్పాటుతో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ

ఏపీపీఎస్సీ ద్వారా వర్సిటీల్లో అధ్యాపక, మినిస్టీరియల్‌ పోస్టుల భర్తీ

బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి తీర్మానం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేద రైతులకు వారి అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్‌ భూములపై వాటి యజమానులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఏపీ అసైన్డ్‌ భూముల(ప్రొబిషన్‌ ట్రాన్స్‌ఫర్‌) చట్టం–1977 సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది.

దీనితో పాటు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు 10 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు బదిలీ చేసుకునే అవకాశాన్నిచ్చింది. సోమవారం శాసన సభ మూడో రోజు సమావే­శాల్లో మంత్రులు ప్రవేశపెట్టిన 10 బిల్లులతో పాటు బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ చేసిన తీర్మానానికీ సభ ఆమోదం తెలిపింది.

పేద విద్యార్థులకు ఉన్నత విద్య
రాష్ట్రంలోని విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం అనేక విద్యా సంస్కర­ణలు తీసుకొచ్చింది. తాజాగా ప్రైవేటు వర్సిటీలు కూడా అంతర్జాతీయంగా టాప్‌ 100 వర్సిటీలతో కలిసి సంయుక్త సర్టిఫికేష¯న్‌ తప్పనిసరిగా అందించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు (స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం–2016ను సవరించింది.

ఇందులో కొత్తగా ఏర్పడే వర్సిటీల్లో 65:35 నిష్పత్తిలో ప్రభుత్వ కోటా (35శాతం సీట్లు) కింద పేద విద్యార్థులకు చదువుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని అధ్యాపక, మినిస్టీరియల్‌ పోస్టుల భర్తీకి రాతపూర్వక పరీక్షలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (వర్సిటీల్లో నియామకాలకు అదనపు ఫంక్షన్లు) చట్టం–2023లో సవరణ చేసింది.

నిరుపేదలకు భూ పంపిణీ
రాష్ట్రంలో భూదాన్‌–గ్రామదాన్‌ బోర్డును ప్రభుత్వ­మే స్వయంగా ఏర్పాటు చేసేలా చట్టాన్ని సవరించింది. భూదాన్‌ ఉద్యమకర్త వినోభా భావే, ఆయన నిర్దేశించిన వ్యక్తుల సమ్మతి ప్రకారమే భూదాన్‌ – గ్రామదాన్‌ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వినోభా భావే మరణించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది. ఆయన నిర్దేశించిన వ్యక్తులు ఎవరనేది స్పష్టత లేకపోవడంతో బోర్డు ఏర్పాటుకు అవాంతరాలేర్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వమే బోర్డును ఏర్పాటు చేసి భూదాన్‌ – గ్రామదాన్‌లోని భూమిని నిరుపేదలకు కేటాయించేలా చర్యలు చేపట్టేలా చట్టాన్ని సవరించింది.

డెఫ్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి జఫ్రీన్‌కు ఉద్యోగం
రాష్ట్రానికి చెందిన డెఫ్‌ ఒలింపిక్‌ విజేత, అంతర్జాతీయ డెఫ్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి షేక్‌ జఫ్రీన్‌కు వ్యవసాయ, సహకార శాఖలో సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా గ్రూప్‌–1 స్థాయి ఉద్యోగాన్ని కల్పిస్తూ ఏపీ పబ్లిక్‌ సర్వీసుల నియామకాలు క్రమద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన స్వరూపాన్ని హేతు బద్ధీకరించే చట్టం–1994ను సవరించింది. జఫ్రీన్‌ క్రీడారంగంలో దేశానికి అందించిన విశిష్ట సేవలను గౌరవిస్తూ  ఈ ఉద్యోగాన్ని ఇచ్చింది.

మరిన్ని వార్తలు