తుప్పల్లో, చెరువుల్లో బ్యాలెట్‌ పేపర్లు

15 Feb, 2021 04:47 IST|Sakshi
ఫోర్జరీ సంతకాలతో రశీదులు చూపుతున్న ఓటర్లు

నారన్నాయుడువలసలో టీడీపీ నేతల దురాగతం

బలిజిపేట (విజయనగరం): విజయనగరం జిల్లా బలిజిపేట మండలంలోని నారన్నాయుడువలసలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. కౌంటింగ్‌ సమయంలో అధికారులు డ్రామా నడిపించి శనివారం రాత్రి 11 గంటలకు టీడీపీ మద్దతు అభ్యర్థి తోముచిట్టి వెంకటరమణ 15 ఓట్లతో గెలుపొందినట్లు ప్రకటించారు. నారన్నాయుడువలస పంచాయతీలో ఉన్న 10 వార్డులకు ప్రాథమిక పాఠశాలలో పోలింగ్‌ నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా పాఠశాల భవనాలున్నాయి. వాటిలో ఒకవైపు ఒక రూములో 3 వార్డులు, వంటగదిలో ఒక వార్డుకు, మరొకవైపు ఉండే భవనాలలో రెండు రూముల్లో 6 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్‌ అయిన తరువాత అన్ని పోలింగ్‌ బాక్సులను ఒకచోట చేర్చి కౌంటింగ్‌ ప్రారంభించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా 4 వార్డుల పోలింగ్‌ బాక్సులను అక్కడే ఉంచి 5,  6, 7, 8, 9, 10 వార్డులకు చెందిన కౌంటింగ్‌ను వేరే భవనాలలో నిర్వహించారు.

ఈ సమయంలో మొదటి 4 వార్డులకు చెందిన బాక్సుల వద్ద టీడీపీ మద్దతుదారులు ఓట్లు మార్పులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు తార్కాణంగా ఆదివారం ఉదయం పోలింగ్‌స్టేషన్‌కు వెనుకభాగంలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారు గుర్తులపై ముద్రలతో ఉండే బ్యాలెట్‌ పేపర్లు, బాక్సుల పై భాగంలో ఉండే సీళ్ల తొలగింపులు చేసిన ఆధారాలు కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామ సమీపంలో ఉండే చెరువులో బ్యాలెట్‌ పేపర్లు, రశీదులు దొరికాయి. ఆబోతుల ప్రసాదు అనే ఓటరు ఒక పర్యాయం ఓటువేసినా అతడి సంతకంతో వేరొక రశీదు రావడాన్ని చూపించారు. ఇదే విషయాన్ని ఆర్వో చంద్రశేఖర్‌ వద్ద ప్రస్తావించగా అన్ని బాక్సులు దగ్గర ఉంచి కౌంటింగ్‌ చేశామని, కౌంటింగ్‌ ఏజెంట్లకు అన్నీ తెలియజేశామన్నారు. బ్యాలెట్‌ పేపర్ల విషయం తెలియదని చెప్పారు. 

మరిన్ని వార్తలు