నా సినిమాల జోలికొస్తే మూడో కన్ను తెరుస్తా 

16 Mar, 2023 03:57 IST|Sakshi

పునరావృతం కాకుండా చూసుకోండి 

నరసరావుపేట ఎమ్మెల్యేపై పరోక్షంగా బాలకృష్ణ ఆగ్రహం 

ఎన్టీఆర్‌ శతాబ్ది చలన చిత్ర పురస్కారాల సభలో హెచ్చరిక

తెనాలి: ‘సినిమా నా ఊపిరి. సినిమా, రాజకీయం నాకు రెండు కళ్లు. నరసరావుపేటలో బాలకృష్ణ పాట వేశారని అభ్యంతరం పెట్టారట.. జాగ్రత్త..’ అంటూ ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలో పెమ్మసాని థియేటరులో జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగిస్తుండగా, పక్కనే ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ చెవిలో నరసరావుపేట అంటూ ఏదో చెప్పారు.

వెంటనే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘నరసరావుపేటలో బాలకృష్ణ పాట ఎందుకు వేస్తారని అన్నారట.. జాగ్రత్త.. ఒకసారి నేను మూడోకన్ను తెరిచానో.. పొలిటీషియన్‌గా నాపై రండి.. నేను రెడీ. సినిమా జోలికొస్తే.. మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోండి’ అంటూ హెచ్చరించారు. పరోక్షంగా నరసరావుపేట ఎమ్మెల్యేనుద్దేశించి బాలకృష్ణ ఈ హెచ్చరిక చేసినట్లు భావిస్తున్నారు. మహానటి సావిత్రి, ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డికి ప్రకటించిన ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కారాలను వారి వారసులు విజయ చాముండేశ్వరి, బి.విశ్వనాథరెడ్డి అదుకున్నారు.

బాలయ్యా.. నోరుపారేసుకోవద్దు: నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి 
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నోరుపారేసుకుంటున్నారని నరసరావుపేట ఎమ్మె­ల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. ‘మహా శివ­రాత్రికి కోటప్పకొండలో ప్రభలు కట్టడం ఆనవాయితీ. భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ప్రజల నుంచి చందాలు వసూలు చేసి ప్రభ కట్టి తాగి తందానాలాడి దానిని కోటప్ప కొండకు తీసుకువెళ్లకుండానే మధ్యలో ఆపేసి ప్రజలకు అసౌకర్యం కలిగించారు. దీనికి బాలకృష్ణ వార్నింగ్‌ ఇచ్చినట్టుగా మాట్లాడటం పద్ధతి కాదు’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు