Madhya Pradesh elections: ఏ ఒక్కరినీ వదిలిపెట్టం! అధికారులకు కాంగ్రెస్‌ చీఫ్‌ వార్నింగ్‌

11 Nov, 2023 18:22 IST|Sakshi

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ కమల్‌నాథ్‌ స్థానిక అధికారులకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. తమ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టబోమని, తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని హెచ్చరించారు. పృథ్వీపూర్‌, నివారీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో శుక్రవారం (నవంబర్‌ 10) జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

ఇంక ఆరు రోజులే..

ఆయా నియోజకవర్గాల్లో స్థానిక అధికారును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘పృథ్వీపూర్, నివారి అధికారులకు నేను ఓ  విషయం చెప్పాలనుకుంటున్నాను. శ్రద్ధగా వినండి. ఇంక ఆరు రోజులే ఉన్నాయి. అప్పటిదాకా మీరు ఏం చేస్తారో చేయండి.  ఆ తర్వాత మిమ్మల్ని ఏం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు’ అని హెచ్చరించారు.

అధికారులు తమను వేధిస్తున్నారని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కమలనాథ్ ఈ హెచ్చరికలు చేశారు. అయితే, ఆయన అధికార యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం ఇదే తొలిసారి కాదు. గత సెప్టెంబర్‌ నెలలోనూ కమలనాథ్‌ ఇలాంటి వార్నింగే ఇచ్చారు. ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని, సాగర్ జిల్లాలో అధికారుల వేధింపులను గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు.

కాగా నవంబర్ 17న మధ్య ప్రదేశ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండూ పూర్తి స్థాయిలో ప్రచారంలో నిమగ్నమయ్యాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

మరిన్ని వార్తలు