పల్లెకూ ఉంది ఓ బడ్జెట్

7 Feb, 2021 05:52 IST|Sakshi

పల్లె పద్దు ఆషామాషీ కాదు

రూపాయి రాక.. పోక వివరాలు పక్కాగా ఉండాల్సిందే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులే కీలకం

సత్తెనపల్లి: బడ్జెట్‌ అంటే బోలెడు లెక్కలు. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. అవసరాలకు తగిన నిధులు కేటాయించాలి. రూపాయి రాక.. పోక వివరాలు పక్కాగా ఉండాలి. అది కేంద్ర బడ్జెట్‌ అయినా.. పల్లె పద్దు అయినా లెక్క పక్కాగా ఉండాల్సిందే. పంచాయతీల ఆదాయ మార్గాలు, పల్లెల ప్రగతికి ఉపకరించే నిధులు, వాటి పద్దుల బడ్జెట్‌ ఎలా ఉంటుందంటే..

కేంద్ర సహకారమే కీలకం
పల్లెలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులే కీలకంగా ఉంటాయి. జనాభా ప్రాతిపదికన వీటిని కేటాయిస్తారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇప్పటికే రెండు దఫాలుగా విడుదలయ్యాయి. ఒక్కో వ్యక్తికి సగటున రూ.550 నుంచి రూ.600 వరకు వస్తోంది. ప్రస్తుతం ఈ నిధుల్లో పంచాయతీలకు 70 శాతం, మండలాలకు 20 శాతం, జెడ్పీకీ 10 శాతం వంతున కేటాయిస్తారు. ఈ నిధుల్లో 50 శాతం టైడ్‌ ఫండ్స్‌ రూపంలో పంచాయతీలు కేంద్ర నిబంధనల ప్రకారం వ్యయం చేయాల్సి ఉంటుంది. వీటిని పారిశుద్ధ్యం, తాగునీటి వనరులు, సిబ్బంది జీతభత్యాలు తదితర అవసరాలకు  వెచ్చించాల్సి ఉంటుంది. మిగిలిన 50 శాతం అన్‌టైడ్‌ ఫండ్స్‌ను ఒక్క  జీతభత్యాలకు కాకుండా ఏ ఇతర పనికైనా వెచ్చించవచ్చు. ఉపాధి హామీ పథకం కింద కొన్ని నిధులు అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సచివాలయ భవనాలు, రహదారులు, ఇతర నిర్మాణాలు, భూగర్భ జల వనరుల పెంపు తదితరాలను ఈ పథకం కిందే అభివృద్ధి చేస్తున్నారు. అన్ని పంచాయతీలకు సమానంగా డబ్బులు ఇస్తారు.

సాధారణ నిధుల వినియోగం ఇలా..
మొత్తం 47 రకాల పన్నులు విధించడానికి పంచాయతీ పాలకవర్గాలకు అధికారం ఉంది. పన్ను విధింపు, అమలుకు గ్రామ సభల్లో తప్పనిసరిగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇందులో ఇంటి పన్ను, వృత్తి, వినోదం, భూమి రిజిస్ట్రేషన్, వేలం, కాటా రుసుము తదితరాలు ఉన్నాయి. పన్నేతర ఆదాయం కింద చెరువుల వేలం, పరిశ్రమలు, మార్కెట్‌ యార్డు ప్రకటనలు, సెల్‌ఫోన్‌ టవర్లు తదితరాల నుంచి ఆదాయం లభిస్తుంది. వృత్తి పన్ను రూపంలో రాష్ట్ర పన్నుల శాఖ వసూలు చేసిన మొత్తంలో 95 శాతం తిరిగి పంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తుంది. పంచాయతీలో తలసరి రూ.4 అందిస్తుంది. వినోదపు పన్నును 60:40 నిష్పత్తిలో ఇస్తారు. గనుల తవ్వకానికి సంబంధించి వసూలయ్యే సీనరేజిలో 25 శాతం చెల్లిస్తుంది.

ఖర్చులకు ఉందో ఆడిట్‌
ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ ఆడిట్‌ రూపంలో లెక్క సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయం మొత్తాన్ని ఖర్చు చేయడానికి స్వేచ్ఛ ఉన్నప్పటికీ లెక్క మాత్రం తప్పకూడదు. వ్యయ నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర, పంచాయతీరాజ్‌ నిబంధనలు పాటించి తీరాలి.  

మరిన్ని వార్తలు