సెంట్రల్‌ వర్సిటీల ఎంట్రన్స్‌లో ఇంటర్‌ వెయిటేజి రద్దు

24 Mar, 2022 04:05 IST|Sakshi

ప్రవేశ పరీక్ష మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్లు

ఇంటర్మీడియట్‌ అర్హత పరీక్ష మాత్రమే

ఈసారి సీయూఈటీలో 45 సెంట్రల్‌ వర్సిటీలు

త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న ఎన్టీఏ

13 భాషల్లో ప్రవేశ పరీక్ష

ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల ఆధారంగా ప్రశ్నలు

సాక్షి, అమరావతి: కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాలకు ఇంటర్‌ మార్కులకు ఎలాంటి వెయిటేజి ఉండదని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) వెల్లడించింది. కొన్ని సెంట్రల్‌ వర్సిటీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ)పై యూజీసీ ఇటీవల పబ్లిక్‌ నోటీసు విడుదల చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. సీయూఈటీ పరిధిలోకి ఈసారి 45 సెంట్రల్‌ వర్సిటీలు ఉన్నాయి. ఇప్పటివరకు కొన్ని వర్సిటీలు ఇంటర్‌ మార్కులను కూడా వెయిటేజిగా తీసుకొంటున్నాయి.

ఇకపై ఇంటర్‌ మార్కులకు వెయిటేజి ఉండదని, ఆయా వర్సిటీలు ఇంటర్మీడియట్‌ను అర్హత పరీక్షగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని యూజీసీ పేర్కొంది. ప్రవేశాలు పూర్తిగా సీయూఈటీలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటాయని స్పష్టంచేసింది. అయితే, యూనివర్సిటీలో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌ అర్హత మార్కులను ఏ మేరకు తీసుకోవాలో ఆ వర్సిటీలే నిర్ణయించుకుంటాయి. అంటే విశ్వవిద్యాలయం నిర్ణయించిన అర్హత మార్కులు పొందిన విద్యార్థులకు మాత్రమే సీయూఈటీలో వచ్చిన మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్‌ (12వ తరగతి) మూల్యాంకన విధానం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉండటం, కొన్ని రాష్ట్రాలు తమ విద్యార్థులకు మేలు చేసేలా ఎక్కువ మార్కులు వేస్తుండడం వల్ల వాటిని పరిగణనలోకి తీసుకోవడం సరికాదని యూజీసీ అభిప్రాయపడింది.

ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలకూ సీయూఈటీతో ప్రవేశాలకు అవకాశం
2022–23 విద్యా సంవత్సరానికి సీయూఈటీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) 13 భాషల్లో నిర్వహిస్తుంది. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, ఇంగ్లిష్‌ భాషల్లో పరీక్ష ఉంటుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్‌ యూనివర్సిటీలు కూడా సీయూఈటీని అనుసరించి ప్రవేశాలు నిర్వహించవచ్చని యూజీసీ పేర్కొంది. సీయూఈటీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌లో ఎన్టీఏ వెబ్‌సైట్లో ఉంచుతారు. పూర్తి నోటిఫికేషన్‌ ఎన్టీఏ విడుదల చేస్తుంది. సీయూఈటీలో మార్కుల ప్రాతిపదికగా ఎన్టీఏ మెరిట్‌ జాబితా విడుదల చేస్తుంది. వర్సిటీలు తమ రిజర్వేషన్‌ విధానాన్ని అనుసరిస్తూనే సీయూఈటీ మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తాయని యూజీసీ ప్రకటించింది. ఎన్‌సీఈఆర్టీ 12వ తరగతి పాఠ్యపుస్తకాల ఆధారంగా సీయూఈటీకి బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షల్లో నెగెటివ్‌ మార్కులుంటాయి. తప్పుడు సమాధానాలకు మార్కుల్లో కోత పడుతుంది.  

మరిన్ని వార్తలు