ఏలూరులో కేసులు తగ్గాయ్

13 Dec, 2020 03:34 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఆళ్ల నాని. చిత్రంలో అధికారులు

బాధితులంతా కోలుకుంటున్నారు

శానిటేషన్, తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాం: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని  

ఏలూరు టౌన్‌: గత వారం రోజులుగా ఏలూరులో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితి నుంచి ప్రజలు బయటకు వస్తున్నారని.. కేసులు కూడా బాగా తగ్గాయని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. బాధితులంతా కోలుకుంటున్నారని తెలిపారు. శనివారం బాధితులను పరామర్శించిన అనంతరం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు ఏలూరులో పరిస్థితిని తెలుసుకుంటూ.. తగిన ఆదేశాలిస్తున్నారని చెప్పారు.

బాధితులు పూర్తిగా కోలుకునే వరకు మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బంది రోజూ పరిశీలించి.. నివేదికలు పంపిస్తున్నారని వివరించారు. బాధితుల ఇంటికే వైద్య సిబ్బంది వెళ్లేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఏలూరులో శానిటేషన్, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. తాగునీటిని మరింతగా పరీక్షించేందుకు కూడా తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునంద, ఏలూరు ఆర్‌డీవో రచన, నగర కమిషనర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు