సచివాలయ సేవలు దేశానికే ఆదర్శం

2 May, 2022 22:44 IST|Sakshi
రామయ్య సన్నిధిలో భారత ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి పీయూష్‌ కుమార్, చిత్రంలో జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మ

సాక్షి,ఒంటిమిట్ట: రాష్ట్రంలో సచివాలయాల సేవలు దేశానికే ఆదర్శమని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని భారత ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి, ఆకాంక్ష జిల్లాల కేంద్ర ప్రాబరీ అధికారి పీయూష్‌ కుమార్‌ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఆయన...ఆదివారం జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌ వర్మతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం సచివాలయ భవన సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను కలెక్టర్, జేసీలు ఆయనకు వివరించారు.

గ్రామ సచివాలయ భవనంలో ప్రదర్శించిన ప్రభుత్వ పథకాల పోస్టర్లను, లబ్ధిదారుల జాబితా, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 2021–2022 సంక్షేమ క్యాలెండర్లను పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో వేర్‌ హౌస్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్, జిల్లా వ్యవసాయ బోర్డు సలహా మండలి సభ్యులు ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులరెడ్డి, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, జెడ్పీసీఈవో సుధాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, కడప తహసీల్దార్‌ శివరామిరెడ్డి, సచివాలయ సిబ్బంది, స్థానిక మున్సిపల్, రెవెన్యు సిబ్బంది పాల్గొన్నారు. 


 

మరిన్ని వార్తలు