ఏపీ ప్రభుత్వ పథకాలు భేష్‌

21 Sep, 2022 04:17 IST|Sakshi
వణుకూరులో లబ్ధిదారులతో మాట్లాడుతున్న కేంద్ర బృందం

సచివాలయాల సేవలూ బాగున్నాయి

అన్ని వర్గాల ప్రజలకు పథకాలు అందుతున్నాయి

కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ బృందం ప్రశంస 

పెనమలూరు/పెదకాకాని: రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ బృందం ప్రశంసించింది. పథకాలు అన్ని వర్గాల ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయని అభినందించింది. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ అండర్‌ సెక్రటరీలు తారాచందర్, అవినాష్‌ చందర్‌ మంగళవారం కృష్ణా జిల్లా వణుకూరు, పెదపులిపాక గ్రామాలతో పాటు గుంటూరు జిల్లా నంబూరులోని ప్రభుత్వ సచివాలయాలు, ఆర్బీకేలు తదితరాలను సందర్శించారు.

వణుకూరు సచివాలయంలో లబ్ధిదారుల వివరాలు, వారికి అందజేస్తున్న పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. అలాగే రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ సేవలను స్వయంగా పరిశీలించారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా లబ్ధి పొందిన చేబ్రోలు బుజ్జి నిర్వహిస్తున్న కిరాణా దుకాణాన్ని సందర్శించారు. వణుకూరు జగనన్న కాలనీలో లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్మిస్తున్న గృహాలను కూడా పరిశీలించారు.

పెదపులిపాకలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి తడి, పొడి చెత్త సేకరణ, వర్మీ కంపోస్టు తయారీపై సంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నంబూరులో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు.

సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, పింఛన్ల పంపిణీ విధానాన్ని ప్రశంసించారు. ఆర్బీకేలోని ఏటీఎంను పరిశీలించారు. 14, 15 ఆర్థిక సంఘాల నిధుల వినియోగం గురించి అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. కేంద్ర బృందం వెంట కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు