బెంగాల్‌ వైపు మళ్లిన అల్పపీడనం

21 Sep, 2022 04:24 IST|Sakshi

ఆపై ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పయనం 

కోస్తాలో నేడు, రేపు మోస్తరు వర్షాలు 

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరం వైపు మళ్లింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా పయనించనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌ వైపు మళ్లడంతో మంగళవారం రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.  

మరిన్ని వార్తలు