నీటి దోపిడీ కోసమే పాలమూరు–రంగారెడ్డి

9 Aug, 2023 03:35 IST|Sakshi

తాగునీటి కోసం 7.15 టీఎంసీలు తీసుకునేందుకే అనుమతి

120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతల పనులు పూర్తి

సుప్రీం కోర్టుకు నివేదించిన కేంద్ర జల్‌ శక్తి శాఖ, కృష్ణా బోర్డు

సాక్షి, అమరావతి: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపో­తల పథకం పనుల్లో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వు­ల్లో అనుమతి ఇచ్చిన దానికంటే తెలంగాణ స­ర్కా­ర్‌ భారీ ఎత్తున పనులు చేసిందని సుప్రీం కో­ర్టుకు కేంద్ర జల్‌ శక్తి శాఖ, కృష్ణా బోర్డు నివేదించాయి. తాగునీటి అవసరాల పేరుతో భారీ ఎత్తున సాగునీటి అవసరాలకు నీటిని తరలించేలా తెలంగా­ణ ప్రభుత్వం పనులు పూర్తి చేసిందని స్పష్టం చేశా­యి.

7.15 టీఎంసీలను తాగునీటి అవ­సరాల­కు తరలించేలా పనులు చేపట్టడానికి అను­మతి ఇస్తే.. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థ, 65.17 టీఎంసీలను నిల్వ చేసేలా 5 రిజర్వాయర్లను తెలంగాణ పూర్తి చేసిందని తేల్చిచెప్పాయి. ఇప్పటివరకూ పూర్తయిన పనులను పరిశీలిస్తే.. తెలంగాణ సర్కార్‌ భారీ ఎత్తున కృష్ణా జలాలను తరలించేలా చేపట్టిందని పేర్కొన్నాయి.

ఆ ఎత్తిపోత­లకు నీటి కేటాయింపులు లేని నేపథ్యంలో దాని డీపీ­ఆర్‌­ను మదింపు చేయలే­మని తెలంగాణ సర్కార్‌కు తేల్చిచెప్పామని గుర్తు చేశాయి. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఈ నెల 2న కేంద్ర జల్‌ శక్తి శాఖ, కృష్ణా బోర్డు సంయుక్తంగా అఫి­డవి­ట్‌ దాఖలు చేశాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై ఈ నెల 4న జరగాల్సిన విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్‌కు వాయిదా వేసింది. 

అఫిడవిట్‌లో ఏం చెప్పాయంటే..
కేంద్ర జల్‌ శక్తి శాఖ, కృష్ణా బోర్డు సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను రూ.55,086.57 కోట్లతో తెలంగాణ సర్కార్‌ చేపట్టింది. ఇందులో నీటిపారుదల వ్యయం రూ.50,508.88 కోట్లు, తాగునీటి విభాగం వ్యయం రూ.4,577.69 కోట్లు. ఈ ఎత్తిపోతల కింద అంజనగిరి (8.51 టీఎంసీలు), వీరాంజనేయ (6.55 టీఎంసీలు), వెంకటాద్రి (16.74 టీఎంసీలు), కరుమూర్తిరాయ (17.34 టీఎంసీలు), ఉద్దండాపూర్‌ (16.03 టీఎంసీలు), కేపీ లక్ష్మిదేవిపల్లి (2.80 టీఎంసీల) రిజర్వాయర్లను చేపట్టింది.

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు.. ఆ జిల్లాల్లో తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్నది ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. ఈ ఎత్తిపోతల కింద తరలించే 120 టీఎంసీల్లో తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 7.15 టీఎంసీలు. ఇప్పటికే 65.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కరుమూర్తిరాయ, ఉద్దండాపూర్‌ రిజ­ర్వా­యర్లను.. 120 టీఎంసీలు తరలించేలా ఎత్తి­పో­తలు, కాలువల వ్యవస్థను పూర్తి చేసింది. ఆరో రిజ­ర్వాయర్‌ కేపీ లక్ష్మిదేవిపల్లి వద్ద ఇప్పటి­దాకా చేప­ట్టలేదు. పూర్తయిన 5 రిజర్వాయర్ల కింద తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 3.40 టీఎంసీలే.

కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలకు, చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలను జతచేసి.. 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టామని తెలంగాణ సర్కార్‌ డీపీఆర్‌ను సమర్పించింది. కానీ.. ఈ ప్రాజెక్టుకు బచావత్‌ ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులు చేయలేదు. నీటి కేటాయింపులపై బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను మదింపు చేయలేమని తెలంగాణ సర్కార్‌కు వెనక్కి పంపాం.

నేపథ్యం ఇదీ..
చంద్రమౌళీశ్వరరెడ్డి అనే రైతు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యు­నల్‌ (ఎన్జీటీ) పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారె­డ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలిపేయాలని 2021 అక్టోబర్‌ 29న ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించి యథే­చ్ఛగా పనులు కొనసాగించిన తెలంగాణ సర్కార్‌పై 2022 డిసెంబర్‌ 22న ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ.. ఆ రెండు ఎత్తిపోతల పథకాల వ్యయంపై 1.50 శాతం చొప్పున రూ.620.85 కోట్లను తెలంగాణ సర్కార్‌కు జరిమానా విధించింది.

తెలంగాణ ఉద్దేశపు­ర్వ­కం­గా చట్టాలను ఉల్లంఘిస్తున్నందున రూ.300 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మొత్తం రూ.920.85 కోట్లు మూడు నెలల్లోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) వద్ద డిపాజిట్‌ చేయాలని నిర్దేశించింది. దీనిపై తెలంగాణ సర్కార్‌ సుప్రీం కోర్టు­ను ఆశ్రయించింది. ఎన్జీటీ ఉత్తర్వుల అమ­లు­ను నిలుపుదల చేస్తూ.. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపో­తల పనులకు   అనుమతిస్తూ 2023 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.   

మరిన్ని వార్తలు