అల్లుడు.. గిల్లుడు.. ఎన్ని కోట్లు 

9 Nov, 2021 11:57 IST|Sakshi

టీడీపీ మాజీ ఎమ్మెల్యేల అల్లుడు, ఆ పార్టీ నేత సంజయ్‌ భూ దందాలు 

నగరి శివారులో 55 ఎకరాల్లో ఫాంహౌస్‌ 

దానికోసం మూడు ఎకరాల డీకేటీ భూమి ఆక్రమణ 

తిరుపతిలో పేదల ఇళ్లలోనూ కక్కుర్తి 

టీడీపీ హయాంలో జరిగినకేటాయింపుల్లో అక్రమాలు 

చివరికి ఆయన ఇంటి వద్ద ఫుట్‌పాత్‌ కూడా... 

ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి.. డిగ్రీ పట్టాతో పొట్ట చేతపట్టుకుని.. నగరానికి వచ్చి.. ఓ హోటల్‌లో చిరుద్యోగిగా చేరాడు.. కొద్దికాలానికే ఆ యజమాని గుడ్‌ లుక్స్‌లో పడ్డాడు. ఆ యజమాని స్నేహితుడు, రాజకీయనేత, ఆస్తిపరుడు అయిన ఒకాయన తన కుమార్తె పెళ్లి సంబంధానికి ఇల్లరికం అల్లుడు కోసం వెతుకుతుండగా ఈ యువకుడు తారసపడ్డాడు. ఆ యజమాని కూడా ఫర్లేదు అని సర్టిఫికెట్‌ ఇవ్వడంతో పెద్దింటల్లుడు అయిపోయాడు. ఇక్కడ వరకు కథ బాగానే ఉంది కదా... కానీ అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. 

పెళ్లి తర్వాత అతను క్రమక్రమంగా మామ వ్యాపారాల్లో దూరాడు. అనారోగ్యంతో మామ చనిపోయిన తర్వాత ఇక ఇంటిపెత్తనం మొత్తం లాగేసుకున్నాడు. ఇది కూడా మనకు సంబంధం లేని వ్యవహారమే. కానీ రాజకీయ నేత అవతారం ఎత్తి... అక్రమానికి, అవినీతికి, అడ్డగోలు దందాలకు, అంతులేని అరాచకానికి తిరుపతిలో కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యాడు.. 

ఇప్పుడు అర్థమైంది కదా.. ఎవరనేది.. అదే అతనే లవ సంజయ్‌. అదేమిటి అన్నేసి మాటలన్నారు.. అని అనుకుంటున్నారా.. అయితే లవ సంజయ్‌ భాగోతాలన్నీ... వామ్మో మొత్తం అవన్నీ చెప్పనలవి కానివే.. కనీసం కొన్నింటిపై ఓ లుక్కేద్దాం రండి. 

సాక్షి ప్రతినిధి, తిరుపతి : బట్టె లవ సంజయ్‌.. అలియాస్‌ సంజయ్‌.. టీడీపీకి చెందిన తిరుపతి మాజీ ఎమ్మెల్యేలు దివంగత వెంకటరమణ, ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జి సుగుణమ్మ అల్లుడిగా ఈయన నగర ప్రజలకు సుపరిచితులు. ఆ ఇంటి అల్లుడి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం.. టీడీపీలో చేరి చివరికి రాజకీయ జన్మనిచ్చిన కుటుంబసభ్యుల సీటుకే గత ఎన్నికల్లో ఎసరు పెట్టాలని యత్నించి.. ఆనక అధినేత చంద్రబాబుతో చీవాట్ల వరకు కొనసాగింది. కుటిల రాజకీయాల్లో అవన్నీ సహజమని అనుకున్నా కుటుంబ సభ్యుల పదవులను, గతంలో టీడీపీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని కొనసాగించిన అక్రమాలు, భూదందాలు ఇప్పుడు కూడా చర్చాంశనీయంగా మారాయి. 

ఫాంహౌస్‌ పక్కన మూడు ఎకరాలు మింగేసి.. 
ముందే చెప్పుకున్నట్టు చిరుద్యోగి నుంచి జీవనం మొదలుపెట్టిన ఆయన తిరుపతిలో బడా బాబుల్లోనే చాలామందికి లేని విధంగా నగరి శివారులో 55 ఎకరాల్లో ఫాంహౌస్‌ కట్టుకున్నారు. అది ఆయన వ్యక్తిగతం అనుకున్నా.. అక్కడ కూడా మూడు ఎకరాల డీకేటీ భూమిని కక్కుర్తిపడి ఆక్రమించుకోవడమే వివాదాస్పదం అవుతోంది. నగరి పట్టణం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముడిపల్లి గ్రామంలో బట్టె లవ సంజయ్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట 54.945 ఎకరాల భూమి ఉంది. 

సంజయ్‌ పేరిట 15.72 ఎకరాలు (ఖాతా నంబరు 783), బట్టె సావిత్రమ్మ పేరిట 17.9375 ఎకరాలు (ఖాతా నంబరు 782), బట్టె వెంకటకీర్తి పేరిట 11.425 ఎకరాలు (ఖాతా నంబరు 780), బట్టె లతా సుమ పేరిట 9.8625 ఎకరాలు (ఖాతా నంబరు 781) ఉన్నాయి. ఈ భూముల్లో స్విమ్మింగ్‌ ఫూల్‌తో సహా సకల సౌకర్యాలు కలిగిన భారీ ఫామ్‌ హౌస్‌ నిర్మించుకున్నారు. ఇందులో ఎవరికీ వివాదం లేదు. కానీ. ఈ భూముల పక్కనే ఉన్న మూడు ఎకరాల డీకేటీ భూములను కూడా మింగేశారు. 

విలువైన ఆ భూములను కూడా కలిపేసుకుని తన ఫాంహౌస్‌కి ఫెన్సింగ్‌ కూడా కట్టేసుకున్నారు. ఏ పని చేసినా పక్కాగా చేసే సంజయ్‌ ఈ మూడు ఎకరాలను కూడా స్థానికుల నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా  ‘రాతపూర్వకంగా’ కొట్టేశారు. అప్పటి వరకు ముడిపల్లి వాస్తవ్యుడి ఆక్రమణలో ఉన్న ఈ మూడు ఎకరాలను పుత్తూరులో ఉన్న ఓ డాక్టర్‌ పేరిట రాయించి అతని నుంచి స్వాధీనం చేసేసుకున్నారు. 

పేదల ఇళ్లలోనూ కక్కుర్తి 
టీడీపీ హయాంలోని 2016లో సంజయ్‌ బినామీలు తిమ్మినాయుడుపాళెం లెక్కదాఖలాలు సర్వే నంబర్‌ 336లో సుమారు 30 సెంట్లు కాలువ పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి తమ రియల్‌ వెంచర్‌లో కలిపేసుకున్నారు. వాస్తవానికి అప్పట్లోనే రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని పరిరక్షించేందుకు వెళ్లగా రాజకీయ ఒత్తిళ్లతో వారిని అడ్డుకున్నారు. ఇక ఆక్రమణ స్థలం చుట్టూ కాలువకు అడ్డుగా ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ పేరిట పేదల ఇళ్లు నిర్మించారు. సుమారు 20 మంది పేదల పేర్లతో పక్కా గృహాలు మంజూరు చేయించి.. చివరికి వాళ్ల దగ్గర నుంచి కూడా అందినకాడికి డబ్బులు వసూలు చేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

గతంలోనే వెలుగులోకి
తిరుచానూరు రోడ్డులోని శిల్పారామం ఎదురుగా 12.5 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని పక్క సర్వే నంబర్‌తో సబ్‌ డివిజన్‌ చేసి ఆక్రమించుకున్నారు. ఆపై రిజిస్ట్రేషన్‌ చేసి సుమారు రూ.60 కోట్లకు పైగా విక్రయించి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. తిరుచానూరు రోడ్డులోని శ్రీనివాసపురం వద్ద 241/3 సర్వే నంబర్‌లోని ఎకరా మేరకు చెరువు పోరంబో స్థలాన్ని పట్టాగా మార్చుకుని విక్రయించి సొమ్ము చేసుకున్నారన్న వాదనలున్నాయి.

ఫుట్‌పాత్‌నూ వదల్లేదు 
అలిపిరి రోడ్డు స్విమ్స్‌ కూడలి సమీపంలో సంజయ్‌ ఇల్లు వాస్తుపేరుతో విశాలమైన ఫుట్‌పాత్‌ను, దానిపై ఉన్న బస్‌ షెల్టర్‌ను గతంలో ధ్వంసం చేశారు. యాత్రికులు, భక్తులతో పాటు స్విమ్స్, బర్డ్స్‌ ఆస్పత్రులకు వచ్చే రోగులు ఎక్కువగా వినియోగించే బస్‌ షెల్టర్, ఫుట్‌పాత్‌లను కేవలం సెంటిమెంట్‌ కారణంగా తీసేశారు. ఇంటికి ఎదురుగా ఫుట్‌పాత్‌ ఉంటే దోషమని జ్యోతిష్యులు చెప్పడంతో తొలగించి అక్కడ వారి కార్ల పార్కింగ్‌కు వినియోగించుకుంటున్నారు. 


 

మరిన్ని వార్తలు