‘అసైన్డ్‌’పై గత సర్కారు తప్పు చేసినా ఎందుకు సహకరించారు?

20 Mar, 2021 04:43 IST|Sakshi

అడ్డగోలుగా క్రమబద్ధీకరణ జరిగినా అభ్యంతరపెట్టలేదెందుకు?

సీఆర్‌డీఏ మాజీ కమిషనర్‌ శ్రీధర్‌పై సీఐడీ ప్రశ్నలవర్షం   

సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్‌ భూముల వ్యవహారంలో గత సర్కారు తప్పు చేసినా ఎందుకు సహకరించారంటూ సీఆర్‌డీఏ మాజీ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారుల బృందం ప్రశ్నించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ తదితరులపై కేసు నమోదు చేసిన సీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సర్కారు హయాంలో రాజధానికోసం భూ సమీకరణ(ల్యాండ్‌ ఫూలింగ్‌) జరిగినప్పుడు ఆ ప్రాంతమున్న గుంటూరు జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌గాను, రాజధానిలో రైతుల భూముల సేకరణ, ప్లాట్లు కేటాయింపు తదితర చర్యలు చేపట్టినప్పుడు సీఆర్‌డీఏ కమిషనర్‌గాను కీలక బాధ్యతలు నిర్వర్తించిన శ్రీధర్‌ను శుక్రవారం విజయవాడలోని సత్యనారాయణపురం సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారించారు.

అసైన్డ్‌ భూములు చట్టవిరుద్ధంగా చేతులు మారుతున్నప్పుడు, అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పుడు కీలక బాధ్యతల్లో ఉన్న మీరు ఎందుకు పట్టించుకోలేదని శ్రీధర్‌పై సీఐడీ అధికారులు ప్రశ్నలవర్షం కురిపించినట్టు సమాచారం. మంత్రివర్గ ఆమోదం లేకుండానే జీవోలు జారీ చేస్తున్నా, అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ అడ్డగోలుగా జరిగినా ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారిగా తన పరిధి మేరకు ఏది చట్టబద్ధమో? ఏది చట్టబద్ధం కాదో? ప్రభుత్వానికి చెప్పడం వరకే తన బాధ్యత అని, ఆచరించడం, ఆచరించకపోవడం అనేది వారిష్టమని శ్రీధర్‌ చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో ఇంకా అనేక కీలక ఆధారాలను శ్రీధర్‌ నుంచి సీఐడీ సేకరించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామానికి చెందిన దళిత రైతుల నుంచి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐడీ పోలీసులు శుక్రవారం పలు వివరాలు సేకరించారు. చంద్రబాబు హయాంలో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తు చేసింది. 

మరిన్ని వార్తలు