President Fleet Review: విశాఖలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

21 Feb, 2022 03:41 IST|Sakshi
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ దంపతులకు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో గవర్నర్‌ హరిచందన్‌

రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఘన స్వాగతం పలికిన గవర్నర్, సీఎం జగన్‌ 

నేడు ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ ప్రారంభం 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత నౌకాదళ శక్తి పాటవాలను సమీక్షించేందుకు సిటీ ఆఫ్‌ డెస్టినీ విశాఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేరుకున్నారు. ఆదివారం ఆయనకు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం (21వ తేదీ) విశాఖలో జరగనున్న ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ (పీఎఫ్‌ఆర్‌)లో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్‌ఎస్‌ డేగకు చేరుకున్నారు. అంతకుముందే విశాఖకు చేరుకున్న గవర్నర్, సీఎంలు ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం 6.25 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లికి బయలుదేరారు.

విశాఖ తీరంలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు సందడి చేస్తున్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పీఎఫ్‌ఆర్‌లో ప్రెసిడెన్షియల్‌ యాచ్‌గా ఉన్న ఐఎన్‌ఎస్‌ సుమిత్ర నుంచి మొత్తం 60 యుద్ధనౌకలను త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి సమీక్షించనున్నారు. చివరిగా భారతీయ నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ ఏకకాలంలో పైకి ఎగిరి రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తాయి. పీఎఫ్‌ఆర్‌లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు ఏపీ గవర్నర్, అండమాన్‌ నికోబార్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పాల్గొంటున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కన్నబాబు, మేకతోటి సుచరిత, ముత్తంశెట్టి శ్రీనివాస్, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి ఉన్నారు.  


‘ఐఎన్‌ఎస్‌ విశాఖ’కు అరుదైన గౌరవం 
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారై మొదటిసారిగా విశాఖకు వచ్చిన ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధ నౌకకు అరుదైన గౌరవం దక్కనుందని తెలుస్తోంది. పీఎఫ్‌ఆర్‌ ప్రారంభమైన వెంటనే ప్రెసిడెన్షియల్‌ యాచ్‌ నుంచి బయలుదేరనున్న రాష్ట్రపతి తొలుత ఈ యుద్ధ నౌక వద్దకు చేరుకుంటారు. అక్కడ నౌకాదళ అధికారులు, సిబ్బంది రాష్ట్రపతికి గౌరవ వందనం చేస్తారు. ఈ నౌకను గతేడాది నవంబర్‌ 21న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ జాతికి అంకితం చేశారు. ప్రాజెక్ట్‌–15బి పేరుతో పూర్తి దేశీయంగా నాలుగు స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ యుద్ధ నౌకలను తయారు చేయాలన్న భారత నౌకాదళ నిర్ణయంలో భాగంగా ఈ నౌకను తయారు చేశారు.

2013లోనే ఈ నౌక తయారీ పనులను ముంబయిలో ప్రారంభించారు. ఈ యుద్ధ నౌక క్షిపణులను తీసుకెళ్లడమే కాకుండా మిసైల్‌ డిస్ట్రాయర్‌గా సేవలందించనుంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళం పరిధిలో చేరింది. దీంతో పాటు వివిధ నావికాదళాల 60 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు పీఎఫ్‌ఆర్‌లో పాలుపంచుకుంటున్నాయి. ప్రధానంగా ముంబయి కేంద్రంగా ఉన్న పశ్చిమ నావికాదళం నుంచి ఐఎన్‌ఎస్‌ చెన్నై, అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌ నుంచి ఐఎన్‌ఎస్‌ ఢిల్లీ, విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళం నుంచి ఐఎన్‌ఎస్‌ సాయద్రీ, కొచ్చి కేంద్రంగా ఉన్న దక్షిణ నావికాదళం నుంచి ఐఎన్‌ఎస్‌ సాపుత్ర పాల్గొంటున్నాయి.

శివాలిక్‌ క్లాస్‌ కింద ఉన్న 4 నౌకలు, కమోర్టా క్లాస్‌లో ఉన్న 3 నౌకలు, చేతక్, ఏఎల్‌హెచ్, సీ కింగ్స్‌ హెలికాప్టర్స్‌తో పాటు కామోవ్స్, డార్నియర్స్, ఐఎల్‌–38ఎస్‌డీ, పీ8ఐ, హాక్స్, మిగ్‌ 29 కే యుద్ధ విమానాలు కూడా పీఎఫ్‌ఆర్‌లో విన్యాసాలు చేయనున్నట్టు భారత నావికాదళ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరికుమార్‌ వెల్లడించారు. పీఎఫ్‌ఆర్‌కు సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. కాగా, ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధ నౌకపై నుంచే ఈ నెల 18న బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగించిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు