YS Jagan: ధాన్యం సేకరణకు 'భరోసా'

8 May, 2021 02:37 IST|Sakshi

ఆర్బీకేల ద్వారానే సేకరణ.. మిల్లర్ల ప్రమేయం వద్దు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ధాన్యం సేకరించాక ఏ మిల్లుకు పంపాలన్నది అధికారుల నిర్ణయం

రైతులకు నష్టం కలగకూడదు

రైతులకు మార్గనిర్దేశం చేసేలా గ్రామ స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలు

క్రాప్‌ ప్లానింగ్‌ మొదలు అన్నిటా రైతులకు అండగా ఆ కమిటీలు

ఈ ప్రక్రియలో మహిళా రైతులకూ భాగస్వామ్యం కల్పించాలి

ఆ కమిటీల బాధ్యతలు, పనితీరుపై నిరంతరం సమీక్ష

రాష్ట్ర స్థాయిలో ఇదంతా పౌర సరఫరాల మంత్రి పర్యవేక్షణ

రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండొద్దు

ధాన్యం సేకరణ, డోర్‌ డెలివరీపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

ఏ విత్తనం వేస్తే బాగుంటుంది? ఏది సాగు చేస్తే పంట కొనుగోలు చేస్తారన్నది రైతులకు వ్యవసాయ సలహా కమిటీలు ముందే చెప్పాలి. అలాగే రైతులకు ధాన్యం ద్వారా తగిన ఆదాయం రాకపోతే (ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గడం లాంటి కారణాల వల్ల) ఏ పంట వేస్తే తగిన ఆదాయం వస్తుందన్న విషయాన్ని రైతులకు తెలియచేయాలి. ఆ మేరకు వారికి ప్రత్యామ్నాయం చూపాలి. అంతేకానీ రైతన్నల ఆదాయం మాత్రం తగ్గకూడదు.    
– సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ పక్కాగా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు. ధాన్యం ఏ మిల్లుకు పంపాలన్నది అధికారులే నిర్ణయించాలని, రైతులకు ఎక్కడా ఏ విధంగానూ  నష్టం కలగకూడదన్నారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలను చైతన్యం చేసి అన్ని అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు ఎలాంటి పంటలు సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుందో సూచిస్తూ ఆర్బీకేలు, ప్రభుత్వంతో అనుసంధానమై వ్యవసాయ కమిటీలు పనిచేస్తాయన్నారు. రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదని సీఎం పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా కళ్లాల (ఫామ్‌ గేట్‌) వద్దే ధాన్యం సేకరణ, రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీపై ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..

మిల్లర్ల ప్రమేయం వద్దు.. 
ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు. ఏ ఊరి పంట ఏ మిల్లర్‌ దగ్గరకు వెళుతుందనే విషయం అధికారులకు మాత్రమే తెలియాలి. అవసరమైతే జిల్లాల కలెక్టర్లు గోనె సంచులు సమీకరించుకోవాలి. ధాన్యం కొనుగోళ్ల సమయంలో తేమ పరిశీలించేందుకు ఆర్బీకేల వద్ద ఆ మీటర్లు కూడా ఉన్నాయి. మిల్లుల వద్దకు ధాన్యం రవాణాలో వ్యయ నియంత్రణ కోసం ఊరికి దగ్గరలోని మిల్లర్‌ వద్దకు పంపించవద్దు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పంపించాలి. చెప్పిన సమయానికి మనమే కొనుగోలు చేయాలి. మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టాలి.

రెండు శాఖలు కలసి పనిచేయాలి...
ఆర్బీకేలకు సంబంధించి వ్యవసాయ శాఖకు ఎంత బాధ్యత ఉందో పౌర సరఫరాల శాఖకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి రైతులు కోరిన విత్తనాలను పౌర సరఫరాల శాఖ ఇవ్వాలి. అందుకోసం పౌర సరఫరాల శాఖ ఆర్బీకేలను ఓన్‌ చేసుకోవాలి. రైతులు బయట విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా వ్యవసాయ శాఖ జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి అవసరమైన విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలి. ఈ – క్రాపింగ్‌ నుంచి మార్కెటింగ్‌ వరకూ రెండూ శాఖలు సమన్వయంతో కలసి పనిచేయాలి.

చురుగ్గా వ్యవసాయ సలహా కమిటీలు..
వ్యవసాయ సలహా కమిటీలు చురుకైన పాత్ర పోషించాలి. క్రాప్‌ ప్లానింగ్‌ మొదలు ఆ కమిటీలు రైతులకు అండగా నిలవాలి. ఈ కమిటీలు గ్రామాల్లో ఆర్బీకేలతో కలిసి పని చేయాలి. అన్నింటిలోనూ మహిళా రైతుల ప్రమేయం కూడా ఉండాలి. కమిటీల బాధ్యతలు, పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యవేక్షిస్తారు. ఎక్కడా రైతులు ఇబ్బంది పడకూడదు. 

రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ..
రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీలో ఎక్కడా లోపం లేకుండా చూడాలి. బియ్యం తీసుకోవడంలో ఎవరూ మిస్‌ కాకుండా చూడాలి. ఆ మేరకు ఎండీయూ (మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌)లు పని చేయాలి. ప్రతి నెలా నిర్ణీత వ్యవ«ధిలోగా తప్పనిసరిగా బియ్యం పంపిణీ జరగాలి. కావాల్సినన్ని వేయింగ్‌ స్కేల్స్‌ (తూకం యంత్రాలు) కొనుగోలు చేయండి. బియ్యం నాణ్యతలో రాజీ పడవద్దు. ఎవరైనా ఇంటి వద్ద రేషన్‌ మిస్‌ అయితే గ్రామ, వార్డు సచివాలయంలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. దీనికి కార్యాచరణ సిద్ధం చేయండి.

రబీ లక్ష్యం 45.20 లక్షల టన్నులు
► ఈ రబీ (2020–21) సీజన్‌లో 45.20 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. గత ఏడాది కంటే ఇది 15 శాతం ఎక్కువని, ఈసారి ఉత్పత్తి 65.23 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు రోజుకు 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తుండగా త్వరలో ఇది 70 వేల మెట్రిక్‌ టన్నులకు చేరుతుందని తెలిపారు.

► కళ్లాల (ఫామ్‌గేట్‌) వద్దే ధాన్యం సేకరించేలా ఆర్బీకేల స్థాయిలో అవసరమైన అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు (పీపీసీ) ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ధాన్యం విక్రయించాలనుకునే రైతులు ఆర్బీకేల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో పేర్లు నమోదు చేసుకుంటే కూపన్‌ ఇచ్చి సేకరణ తేదీని తెలియచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం నిర్దేశించిన రోజు పీపీసీ సిబ్బంది స్వయంగా రైతుల దగ్గరకు వెళ్లి ధాన్యం సేకరిస్తున్నారని అధికారులు వివరించారు. 

► సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్, పౌర సరఫరాల సంస్థ వీసీ ఎండీ ఎ.సూర్యకుమారి, వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు