CM YS Jagan: రైతు రాజ్యమిది

2 Jun, 2023 03:29 IST|Sakshi

అన్నదాతల బాగోగులపై రాజీలేదు: పత్తికొండ సభలో సీఎం జగన్‌

రైతన్నలకు ఇచ్చిన ప్రతీ మాటను మీ బిడ్డ ప్రభుత్వం నిలబెట్టుకుంది

చెప్పిన దానికంటే మిన్నగా ఐదో ఏడాదీ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాం

వైఎస్సార్‌ రైతు భరోసాతో 52,30,939 మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,923 కోట్లు 

51 వేల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.54 కోట్ల జమ

రైతుభరోసా నాలుగు విడతలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినా రైతన్నలు అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతో అదనంగా ఐదో విడత కూడా ఇస్తున్నాం. పంట నష్టపోతే వెంటనే ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించేలా మార్పులు తెచ్చాం. అదే సీజన్‌ ముగిసేలోగా పరిహారం చెల్లించి ఆదుకుంటున్నాం. రైతన్నలు బాగుండాలని మీబిడ్డ రాజీ పడకుండా పని చేస్తున్నాడు.

రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులు పెరిగాయి. నిషేధిత జాబితాలోని చుక్కల భూములకు మోక్షం కల్పించాం. రైతుల పాలిట శత్రువు, వ్యవసాయం అంటే గిట్టని చంద్రబాబు మాయ మాటలతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నాడు. మీరంతా జాగ్రత్తగా ఉండాలని, మంచి – చెడుకు తేడాను ఆలోచించాలని కోరుతున్నా.
 – పత్తికొండ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి కర్నూలు: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని దృఢంగా విశ్వసిస్తూ అన్నదాతలకు నాలుగేళ్లలో రూ.1.61 లక్షల కోట్లకుపైగా నేరుగా ప్రయోజనం చేకూర్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ ద్వారా 52,30,939 మంది రైతుల ఖాతాల్లో రూ.3,923 కోట్లను బటన్‌ నొక్కి జమ చేసిన అనంతరం నిర్వ­హిం­చిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లా­డారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..
కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన సభకు భారీగా హాజరైన జనసందోహంలో ఓ భాగం 

చెప్పిన దానికి కంటే మిన్నగా..
‘మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతీ మాటను మీబిడ్డ ప్రభుత్వం నిలబెట్టుకుంది. వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ యోజన కింద ఐదో ఏడాది తొలి విడత సాయాన్ని విడుదల చేస్తున్నాం. ప్రతీ రైతుకు మంచి జరగాలనే తాపత్రయంతో ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పిన దానికి కంటే మిన్నగా రూ.13,500 చొప్పున ఇస్తున్నాం. మేనిఫెస్టోలో నాలుగేళ్లు మాత్రమే అని చెప్పినా రైతన్నలు ఇబ్బందులు పడకూడదని ఐదో ఏడాది కూడా ఇస్తున్నాం. మొత్తంగా రూ.67,500 ఇస్తున్నాం.

మీ బిడ్డ ప్రభుత్వం చెప్పిన దాని కంటే రూ.17,500 ఎక్కువ ఇస్తోంది. ఇప్పటికే  50 లక్షల పైచిలుకు రైతులకు రూ.54 వేలు చొప్పున వైఎస్సార్‌ రైతు భరోసా డబ్బులు అందించాం. ఈదఫా ఇస్తున్న రూ.7,500 కలిపితే రూ.61,500 నేరుగా రైతన్నల ఖాతాల్లో చేరినట్లవుతుంది. ప్రతీ రైతన్న ఖాతాల్లోకి రూ.5,500 వెళ్తాయి.

మిగిలిన రూ.2 వేలు పీఎం కిసాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా జమ అవుతుంది. వారు ఇచ్చేది ఆలస్యమైనా రైతన్నలు ఇబ్బంది పడకూడదని ఈరోజే బటన్‌ నొక్కి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను ఇచ్చేస్తున్నాం. ఈరోజు వరకూ  మీ బిడ్డ ప్రభుత్వం ఒక్క రైతుభరోసా ద్వారా  రైతన్నల ఖాతాల్లో జమ చేసిన సొమ్ము అక్షరాలా రూ.31 వేల కోట్లు.

ఇన్‌పుట్‌ సబ్సిడీగా మరో రూ.54 కోట్లు 
రైతు భరోసాతో పాటు ఇవాళ ఇంకో మంచి కార్యక్రమం జరుగుతోంది. ఇన్‌పుట్‌ సబ్సిడీ విషయంలో మీబిడ్డ ప్రభుత్వం ఇప్పటికే ఒక విప్లవాత్మక మార్పు తెచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లోనే పరిహారాన్ని చెల్లిస్తున్నాం.

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన 51 వేల మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా మరో రూ.54 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఈరోజే జమ చేస్తున్నాం. గత నాలుగేళ్లుగా 22,77,000 మంది రైతన్నలకు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో ఆదుకుంటూ రూ.1,965 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశాం.

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు
దండిగా దిగుబడులు..
చంద్రబాబు హయాంలో ఆర్బీకేలు, ఈ–క్రాప్, సోషల్‌ ఆడిట్‌ ఊసే లేదు. 10,778 ఆర్బీకేలను నెలకొల్పి రైతన్నలకు నిరంతరం తోడుగా ఉంటున్నాం. 2014–19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి  ఏటా 153 లక్షల టన్నులు కాగా మన ప్రభుత్వంలో 2019–23 మధ్య ఏటా సగటున 165 లక్షల టన్నులకు చేరింది. ఉద్యాన పంటల దిగుబడి చంద్రబాబు హయాంలో ఏటా సగటున 228 లక్షల టన్నులు ఉండగా మన హయాంలో 332 లక్షల టన్నులకు పెరిగింది. 

బాబు హయాం మొత్తం కరువే
చంద్రబాబు హయాంలో ఏ ఏడాది చూసినా కరువే కరువు. ఏటా కనీసం సగం మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన దుస్థితి. అప్పట్లో 1,623 కరువు మండలాలు ప్రకటించారు. ఇప్పుడు గత నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన  పరిస్థితి రాలేదు. చంద్రబాబు పాలనలో సున్నా వడ్డీ కింద 40,60,000 మంది రైతన్నలకు రూ.685 కోట్లు విదల్చగా మీ బిడ్డ ప్రభుత్వం రూ.1,835 కోట్లు ఇచ్చింది. 74 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ ద్వారా మంచి చేయగలిగాం.

చంద్రబాబు హయాంలోని సున్నా వడ్డీ పెండింగ్‌ బకాయిలను చిరునవ్వుతో ఇచ్చాం. ఇక చంద్రబాబు హయాంలో 30,85,000 మంది రైతులకు రూ.3,411 కోట్లు పంటల బీమా కింద ఇవ్వగా ఇప్పుడు నాలుగేళ్లలో వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా ద్వారా 44 లక్షల మంది రైతులకు రూ.6,685 కోట్లు అందించాం. నిరుడు ఖరీఫ్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్‌ను నాన్న జయంతి రోజైన జూలై 8వ తేదీన జమ చేస్తాం. రైతన్నల నుంచి ఒక్క రూపాయి కూడా బీమా ప్రీమియం తీసుకోకుండా పూర్తి బీమా తానే భరిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదే.

ధాన్యం సేకరణ..
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 2.65 కోట్ల టన్నుల ధాన్యం సేకరించగా మనందరి ప్రభుత్వం నాలుగేళ్లలోనే 3.09 కోట్ల టన్నుల ధాన్యం సేకరించింది. ఇంకా రబీలో సేకరణ జరుగుతోంది. మరో ఏడాది కూడా సేకరణ జరుగుతుంది. గతంలో సగటున ఏటా 53 లక్షల టన్నులు మాత్రమే సేకరిస్తున్న పరిస్థితి నుంచి ఈరోజు 75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరుగుతోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో ధాన్యం సేకరణకు చేసిన వ్యయం రూ.40,237 కోట్లు. మీ బిడ్డ ప్రభుత్వం నాలుగేళ్లలోనే ఇప్పటికే రూ.60 వేల కోట్లు సేకరణకు వెచ్చించింది. ఇంకా రబీ పూర్తి కాలేదు.

మరో ఏడాది కూడా ఉంది. ఈ ఏడాది కూడా కలిపితే కనీసం రూ.77 వేల కోట్లు అవుతుంది. ఎక్కడ రూ.40 వేలకోట్లు? ఎక్కడ రూ.77 వేల కోట్లు? తేడా గమనించాలని కోరుతున్నా. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలను సైతం మీబిడ్డ ప్రభుత్వం చెల్లించింది. చంద్రబాబు బకాయి పెట్టిన రూ.384 కోట్ల విత్తన బకాయిలు కూడా మనమే చెల్లించాం. చంద్రబాబు హయాంలో ఎగ్గొట్టిన కరెంట్‌  బకాయిలు రూ.8,845 కోట్లను కూడా రైతన్నల కోసం మీబిడ్డ ప్రభుత్వమే భరిస్తోంది. 

గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు..
మీబిడ్డ ప్రభుత్వంలో 70 నియోజకవర్గ స్థాయిలో 70 ఆర్గానిక్‌ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ కళ్లెదుటే కనిపిస్తున్నాయి. రెండు జిల్లాస్థాయి ల్యాబ్స్‌ , మరో నాలుగు రీజనల్‌ కోడింగ్‌ సెంటర్లు కూడా ఏర్పాటయ్యాయి. మరో 77 నియోజకవర్గాల్లో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు నిర్మిస్తున్నాం. మరో 11 జిల్లా స్థాయి ల్యాబ్స్‌ కూడా నిర్మాణాలు మొదలయ్యాయి.

ఆర్బీకేల స్థాయిలో సీడ్‌ టెస్టింగ్, సాయిల్‌ టెస్టింగ్‌ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్బీకేలు రానున్న రోజుల్లో వ్యవసాయం చేసే విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే ద్వారా వివాదాలకు తావు లేకుండా రైతన్నల చేతుల్లో భూహక్కు పత్రాలను పెట్టే కార్యక్రమం మీబిడ్డ హయాంలో జరుగుతోంది. గ్రామస్థాయిలో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకున్నాం. 

చుక్కల భూములకు మోక్షం..
టీడీపీ హయాంలో నిషేధిత జాబితాలో చేర్చిన లక్షల ఎకరాల చుక్కల భూములకు విముక్తి కల్పించింది మీబిడ్డ ప్రభుత్వమే అని చెప్పేందుకు గర్వపడుతున్నా. రైతులకు ఏ ఇబ్బందీ రాకూడదని పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. రూ.1,700 కోట్లతో ఫీడర్లను బలోపేతం చేశాం. ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్తు రూపాయిన్నరకే  అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ఆక్వా రైతులకు రూ.2,967 కోట్లు సబ్సిడీ రూపంలో ఇచ్చాం. కరువు సీమగా పేరున్న రాయలసీమ ఈరోజు కళకళలాడుతోంది.

అమూల్‌ రాకతో హెరిటేజ్‌ లాంటి సంస్థలు తప్పని పరిస్థితుల్లో పాల సేకరణ ధర పెంచాయి. కేంద్రం ఎంఎస్‌పీ ప్రకటించని ఆరు పంటలకు కూడా మీబిడ్డ ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. పశు నష్టపరిహారం కింద రూ.667 కోట్లు చెల్లించాం. ఆయిల్‌పామ్‌ రైతులను ఆదుకునేందుకు రూ.85 కోట్లు ఇచ్చాం.  వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత ద్వారా ఐదు లక్షల మంది అక్కచెల్లెమ్మలు పశుసంపద కొనుగోలు చేసి పాడి వ్యాపారాలను నిర్వహించుకునేలా తోడుగా నిలబడ్డాం.

పశువులకు సైతం 340 అంబులెన్స్‌లు ఈరోజు అందుబాటులో రాష్ట్రంలో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో పశువ్యాధుల కోసం డయాగ్నోస్టిక్‌ ల్యాబ్స్‌ ఏర్పాటయ్యాయి. రూ.1,052 కోట్ల విలువైన యంత్ర పరికరాలను ఆర్బీకేల స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నాం. వ్యవసాయంలో తొలిసారిగా డ్రోన్లు తెస్తున్నాం. ప్రతీ ఆర్బీకేలో మన రైతన్నలే డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేసే రోజు త్వరలోనే రానుంది.  

మరిన్ని వార్తలు