French Open: 5 గంటల 26 నిమిషాలు.. సంచలన ఫలితం

2 Jun, 2023 03:28 IST|Sakshi

సుదీర్ఘ పోరులో ఎనిమిదో సీడ్‌ సినర్‌ పరాజయం

రెండు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకొని నెగ్గిన అల్ట్‌మైర్‌

మూడో రౌండ్‌లోకి జొకోవిచ్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో గురువారం సంచలన ఫలితం నమోదైంది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఎనిమిదో సీడ్‌ యానిక్‌ సినర్‌ (ఇటలీ) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. 5 గంటల 26 నిమిషాలపాటు పోరాడిన ప్రపంచ 79వ ర్యాంకర్‌ డానియల్‌ అల్ట్‌మైర్‌ (జర్మనీ) రెండు మ్యాచ్‌ పాయింట్లను కూడా కాపాడుకొని సినర్‌ను బోల్తా కొట్టించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు.

గురువారం జరిగిన ఈ మారథాన్‌ సమరంలో అల్ట్‌మైర్‌ 6–7 (0/7), 7–6 (9/7), 1–6, 7–6 (7/4), 7–5తో సినర్‌ను ఓడించాడు. ఈ గెలుపుతో గత ఏడాది యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ తొలి రౌండ్‌లో సినర్‌ చేతిలో ఎదురైన ఓటమికి అల్ట్‌మైర్‌ బదులు తీర్చుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో నాలుగో సెట్‌లోనే సినర్‌ విజయం అంచుల్లో నిలిచాడు. నాలుగో సెట్‌లో 5–4తో ఆధిక్యంలో నిలిచి తన సర్వీస్‌లో రెండుసార్లు మ్యాచ్‌ పాయింట్లు కూడా సంపాదించాడు. అయితే అల్ట్‌మైర్‌ పట్టుదలతో పోరాడి రెండుసార్లూ మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకున్నాడు.

అదే జోరులో సినర్‌ సర్వీస్‌ను కూడా బ్రేక్‌ చేసి స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో అల్ట్‌మైర్‌ పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్‌ ఏకంగా 93 నిమిషాలు జరగడం విశేషం. నిర్ణాయక ఐదో సెట్‌లోని 11వ గేమ్‌లో సినర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అల్ట్‌మైర్‌ 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయం ఖరారు చేసుకున్నాడు. ఈ గేమ్‌లో సినర్‌కు నాలుగుసార్లు అల్ట్‌మైర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసే అవకాశం వచ్చినా వృథా చేసుకున్నాడు.  

రూడ్‌ ముందంజ
పురుషుల సింగిల్స్‌ ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా), నాలుగో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. జొకోవిచ్‌ 7–6 (7/2), 6–0, 6–3తో  ఫచ్‌సోవిచ్‌ (హంగేరి)పై, రూడ్‌ 6–3, 6–2, 4–6, 7–5తో జెపెరి (ఇటలీ)పై నెగ్గారు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) 6–4, 6–0తో క్లెయిరి లియు (అమెరికా)ను ఓడించి మూడో రౌండ్‌కు చేరింది. నాలుగో సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌), ఏడో సీడ్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యునీషియా) కూడా మూడో రౌండ్‌కు చేరారు.

మరిన్ని వార్తలు