అధైర్య పడొద్దు... అండగా ఉంటా

30 Sep, 2023 05:22 IST|Sakshi
చిన్నారెడ్డి సమస్యను వింటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన సీఎం జగన్‌ 

తక్షణమే సాయం అందించిన కలెక్టర్‌

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారులకు శుక్రవారం ఐదో విడత ఆర్ధిక సాయం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి క్యాంపు కార్యాలయానికి వెళ్లే సమయంలో పొందుగుల చిన్నారెడ్డి, నాగోజి చంద్ర శేఖర్‌ల ఆనారోగ్య సమస్యలను ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు సీఎంకు వివరించారు. విజయవాడ భవానీపు­రానికి చెందిన పొందుగుల చిన్నారెడ్డికి ఇటీవల జరిగిన ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతింది. తాను ఏ పని చేయలేకపోతున్నానని, తన ఇద్దరు కుమార్తెలతో జీవనోపాధి ఇబ్బందికరంగా ఉందని సీఎంకు చెప్పారు.

చంద్రశేఖర్‌కు రూ.లక్ష చెక్కు అందజేస్తున్న కలెక్టర్,ఎమ్మెల్యే 

సమస్యను విన్న సీఎం జగన్‌ చలించి మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే భవానీపురానికే  చెందిన నాగోజి చంద్ర శేఖర్‌ తన కిడ్నీలు పాడైపోయిన కారణంగా ఆర్థిక కారణాలతో వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందిగా ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. అతని సమస్యను విన్న సీఎం వైద్య సేవల నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించారు. ఇరువురి సమస్యను విన్న సీఎం జగన్‌ అధైర్య పడొద్దు అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. సీఎం ఆదేశించిన వెంటనే ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు ఎమ్మెల్యే వెలంపల్లితో కలిసి శ్రీనివాసరెడ్డికి రూ.10 లక్షలు, చంద్రశేఖర్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష  చెక్కును అందజేశారు. 

మరిన్ని వార్తలు