YS Jagan: మందులపై నిరంతరం తనిఖీలు

18 Aug, 2021 02:18 IST|Sakshi
ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రభుత్వ ఆస్పత్రుల్లోని దుకాణాల్లో కూడా తనిఖీలు చేయాలి 

ఔషధ నియంత్రణ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నియామకాలపై సమీక్షలో సీఎం జగన్‌

మందుల్లో నాణ్యత లేకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది        

జీఎంపీ ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి

పిల్లల్లో న్యుమోనియా మరణాల నివారణకు కొత్త వ్యాక్సిన్‌

వ్యాక్సినేషన్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాలను వినియోగించుకోవాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్‌మెంట్‌ పూర్తి చేయాలి 

సమర్థవంతమైన ఔషధ నియంత్రణ కోసం ప్రత్యేకంగా రెండు వెబ్‌సైట్లు

ఫోన్, వాట్సాప్, మెయిల్‌.. ద్వారా ఫిర్యాదులకు అవకాశం

డ్రగ్స్‌ తయారీదారుల నుంచి పంపిణీదారుల వరకు ట్రాకింగ్‌

నిర్దేశించిన విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రిక్రూట్‌మెంట్‌ పూర్తి చేయాలి. పీహెచ్‌సీలు మొదలు సీహెచ్‌సీలు, బోధనాస్పత్రుల్లో 90 రోజుల్లోగా నియామక ప్రక్రియ పూర్తి కావాలి. ఆ తర్వాత ఎక్కడా కూడా సిబ్బంది లేరన్న మాట వినిపించకూడదు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: నాణ్యత కలిగిన ఔషధాలే ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఇందుకోసం విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మందుల దుకాణాల్లో కూడా తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. జీఎంపీ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే దానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం నిరంతర తనిఖీలు కొనసాగాలని అధికారులను ఆదేశించారు. ఔషధ నియంత్రణ, పిల్లల్లో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్, వైద్య రంగంలో నాడు–నేడు పనులు, ఆస్పత్రుల్లో నియామకాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని రకాల ఔషధ దుకాణాల్లో తనిఖీలు చేయడంతో పాటు, ఆ సమయంలో గుర్తించిన అంశాలపై ఫాలో అప్‌ ఉండాలని సూచించారు. ఇచ్చిన సూచనలు, ఆదేశాలను నిర్దేశిత సమయంలో అమలు చేశారా? లేదా? అన్నదానిపై నిర్ణీత కాలం తర్వాత మళ్లీ తనిఖీలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మందుల్లో నాణ్యత లేకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. అందువల్ల అక్కడి డ్రగ్‌ స్టోర్లలో కూడా తరచూ కచ్చితంగా తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్ద ఔషధ కంపెనీల రిజిస్ట్రేషన్‌ అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. క్రమం తప్పకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరిగేలా చూడాలని, తద్వారా వారి ఉత్పత్తులపై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని పేర్కొన్నారు. సమర్థవంతమైన ఔషధ నియంత్రణ, పరిపాలన కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ నిర్వహణపై సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించారు.  

ఇక నుంచి పిల్లలకు 10 రకాల వ్యాక్సిన్లు
పిల్లల్లో న్యుమోనియా నివారణకు ఇకపై న్యూమోకోకల్‌ కాంజ్యుగట్‌ వ్యాక్సిన్‌ను (పీసీవీ) ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను వారు సీఎం జగన్‌కు వివరించారు. ఇప్పటి వరకు పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్లు అందిస్తున్నామని, కొత్తగా న్యూమోకోకల్‌తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. వ్యాక్సినేషన్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాలను వినియోగించుకోవాల్సిందిగా సీఎం జగన్‌ సూచించారు. విలేజ్, వార్డు క్లినిక్‌లు ఏర్పాటైన తర్వాత అక్కడి నుంచి పిల్లలకు సమర్థవంతంగా వ్యాక్సినేషన్‌ అందించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో నాడు– నేడు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఔషధ వెబ్‌సైట్లతో ఎంతో ఉపయోగం
► ఔషధాల నాణ్యత, ప్రమాణాలను పాటించేలా చేయడంలో దోహదకారిగా కంప్యూటర్‌ ఎయిడెడ్‌ సెలెక్షన్‌ ఆఫ్‌ ఇన్‌స్పెక్షన్‌ (సీఏఎస్‌ఐ) పేరిట ప్రభుత్వం నూతన వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఔషధ తయారీ సంస్థల నుంచి రిటైల్‌ దుకాణాల వరకు దీని పరిధిలోకి వస్తాయని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. 

► టెలిఫోన్, వాట్సాప్, మెయిల్‌.. ఇతరత్రా మార్గాల ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరించొచ్చని తెలిపారు. తనిఖీల్లో పారదర్శకత, నాణ్యత, నిరంతర ఫాలోఅప్‌ కోసం ఈ వెబ్‌సైట్‌ బాగా ఉపయోగంగా ఉంటుందన్నారు.

► ఔషధాల్లో కల్తీ నివారించడానికి ప్రివెంటివ్‌ యాక్షన్‌ థ్రూ డ్రగ్‌ సర్వైలెన్స్‌ (పీఏడీఎస్‌ – పాడ్స్‌) పేరిట మరొక  వెబ్‌సైట్‌ రూపొందించామని తెలిపారు. డ్రగ్స్‌ తయారీ దారుల నుంచి పంపిణీదారుల వరకు ట్రాకింగ్‌ ఉంటుందని, ఏ కంపెనీ నుంచి డ్రగ్‌ తయారైంది.. లైసెన్స్‌లు ఉన్నాయా? లేవా తదితర అంశాలన్నింటిపైనా  తనిఖీ ఉంటుందని వివరించారు.

► గతంలో అజిత్రోమైసిన్‌ మందును ఉత్తరాఖండ్‌లో ఒక కంపెనీ తయారు చేసినట్టుగా చెప్పారని, ఆరా తీస్తే అలాంటి కంపెనీయే లేదని, వారు తయారు చేసిన టాబ్లెట్లలో ఎలాంటి డ్రగ్‌ లేదని తేలిందన్నారు. ఇలాంటి వాటి నివారణకు ఈ వెబ్‌సైట్‌ ఉపకరిస్తుందన్నారు.  

మరిన్ని వార్తలు