జగనన్న ఆరోగ్య సురక్షతో రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలి: సీఎం జగన్‌

13 Oct, 2023 12:48 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో జగనన్న ఆరోగ్య సురక్ష సహా పలు అంశాలపై సంబంధిత అధికారులతో వైఎస్‌ జగన్‌ చర్చించారు

ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్షపై వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకూ 1,22,69,512 కుటుంబాలపై సర్వే చేసినట్టు అధికారులు తెలిపారు.  సీఎం జగన్‌ మాట్లాడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలని తెలిపారు. పేషెంట్లకు అందుతున్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

హెల్త్‌ క్యాంపులను నిర్వహించడమే కాదు, వారి ఆరోగ్యం బాగు అయ్యేంతవరకూ చేయిపట్టుకుని నడిపించాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. చికిత్స అనంతరం వాడాల్సిన మందుల విషయంలో అవి ఖరీదైనా సరే వారికి అందించాలన్నారు. ప్రతీ నెలకు మండలంలో నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. రోగుల సంతృప్తి, క్యాంపుల్లో సదుపాయాలు, రోగులకు చేయూత నందించడం, ఆరోగ్య సురక్ష కార్యక్రమంమీద అవగాహన  ఈ 4 అంశాలమీద తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చదవండి: చంద్రబాబు ఇంటి భోజనంపై అనుమానాలు?: మంత్రి అమర్‌నాథ్‌

సీఎం జగన్‌ ఇంకేం మాట్లాడారో ఆయన మాటాల్లోనే..
► ఆరోగ్య సురక్ష మీద ప్రతి వారం క్రమం తప్పకుండా నా దగ్గర సమీక్షలు చేయాలి. ప్రతి ఒక్కరి ఫోన్‌లో కూడా ఆరోగ్య శ్రీ యాప్‌ని డౌన్లోడ్‌ చేయాలి. దీని వల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుంది.
►అలాగే దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ మార్పులు రావాలి.
►నిపుణులైన వైద్యులు ఆరోగ్య సురక్షా శిబిరాలకు వస్తున్నప్పుడు అక్కడే వీరికి సర్టిఫికెట్లు జారీచేయాలి.
►తిరుపతి తరహాలోనే చిన్నపిల్లలకోసం అత్యాధునిక ఆస్పత్రిని విజయవాడ–గుంటూరు, విశాఖపట్నంలలో ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలి.
►ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు