ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు!

8 Jul, 2021 03:14 IST|Sakshi
క్యాంపు కార్యాలయంలో నాడు–నేడు, విద్యాకానుకలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

ఈలోగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ పూర్తిచేసేందుకు కార్యాచరణ 

అదే నెలలో విద్యాకానుక, నాడు–నేడు రెండో విడత పనులు ప్రారంభం 

విద్యారంగంలో నాడు–నేడు, విద్యాకానుకలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష  

నైపుణ్యం ఉన్న టీచర్లతో నాణ్యమైన విద్య బోధనకే నూతన విద్యావిధానం 

ఇంటర్‌ ఫైనలియర్‌ మార్కుల అసెస్‌మెంట్‌ విధానం ఖరారు

సాక్షి, అమరావతి: వచ్చేనెల 15వ తేదీ తర్వాత పాఠశాలలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని నిర్ణయం తీసుకుంది. అదేనెలలో విద్యాకానుకను అమలు చేయాలని, నాడు–నేడు రెండో విడత పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతోపాటు మొదటి విడతలో నాడు–నేడు కింద పనులు పూర్తిచేసుకున్న పాఠశాలలను ఆగస్టులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అంకితం చేయనున్నారు. విద్యారంగంలో నాడు–నేడు, విద్యాకానుక, నూతన విద్యావిధానంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలోనే ఇంటర్‌ ఫైనల్‌ ఇయర్‌ మార్కుల అసెస్‌మెంట్‌ విధానాన్ని ఖరారు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నైపుణ్యం ఉన్న టీచర్లతో బోధనకే నూతన విద్యావిధానమని ముఖ్యమంత్రి చెప్పారు. నూతన విద్యావిధానంలో ఒక్క స్కూలు మూసేయకూడదని, ఒక్క టీచర్‌ను కూడా తొలగించకూడదని అధికారులకు స్పష్టం చేశారు. విద్యారంగంలో సమూల మార్పులతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ వారంలో ప్రతిపాదనలను ఖరారు చేయాలని ఆయన ఆదేశించారు. నూతన విద్యావిధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.  

నూతన విద్యావిధానంతో ఉపాధ్యాయులు, పిల్లలకు మేలు 
నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ) ప్రకారం.. నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా నూతన విద్యావిధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. నూతన విద్యావిధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు మేలు కలుగుతుందన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందాలని, సబ్జెక్టు మీద గట్టిపట్టున్న ఉపాధ్యాయుల సేవలను సమర్థంగా మంచి చదువులకోసం వాడుకోవాలని, అందుకనే నూతన విద్యావిధానమని చెప్పారు.  

నాడు–నేడు పనులు షెడ్యూలు ప్రకారం జరగాలి 
నాడు–నేడు పనులు.. నిధుల విడుదల దగ్గర నుంచి పనుల వరకు షెడ్యూల్‌ ప్రకారం నిర్ణీత సమయంలోగా అన్నీ జరగాలని సీఎం చెప్పారు. దీనివల్ల ఫలితాలు త్వరగా పిల్లలకు అందుతాయన్నారు. నూతన విద్యావిధానం ప్రతిపాదనల ప్రకారం అంగన్‌వాడీ సెంటర్లను మ్యాపింగ్‌ చేసిన అధికారులు వాటి వివరాలను సీఎంకు తెలిపారు. నూతన విద్యావిధానం కోసం కొత్త తరగతి గదుల నిర్మాణం వల్ల రెండోదశ నాడు–నేడుకు ఎలాంటి భంగంరాకూడదని సీఎం స్పష్టం చేశారు. నాడు–నేడు యథావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. కనీసం 21,654 తరగతి గదులు నిర్మించాల్సి ఉంటుందన్నది ప్రాథమిక అంచనా అని అధికారులు తెలిపారు. మొదటివిడత నాడు–నేడు, రెండో విడత నాడు–నేడు ఖర్చుకు ఇది అదనం అని చెప్పారు. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు ఉండే వాతావరణం కల్పించడానికే నాడు–నేడు కింద మౌలిక వసతులను కల్పిస్తున్నామని, ఈ విషయంలో రాజీపడరాదని చెప్పారు.  

జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్‌బుక్‌ యాక్టివిటీస్‌ 
పాఠశాల విద్యార్థులకు జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు ఉపాధ్యాయులు వర్కబుక్‌ యాక్టివిటీస్‌ నిర్వహిస్తారు. వర్క్‌బుక్స్‌ ద్వారా పిల్లలకు బోధిస్తారు. వర్క్‌ బుక్స్‌ను కరెక్ట్‌ చేసి పిల్లలకు తగిన సూచనలను అందులోనే పొందుపరుస్తారు.

విద్యాకానుక సిద్ధంగా ఉందా? 
విద్యార్థులకు ఆగస్టులో విద్యాకానుక అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యాకానుకలో భాగంగా ఇవ్వనున్న ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ టు ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీలను ముఖ్యమంత్రి పరిశీలించారు. విద్యాకానుకలో భాగంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, యూనిఫాం, నోట్‌బుక్స్, షూ, బెల్టు అన్నీ సిద్ధం అయ్యాయా? లేదా? అన్నది సమీక్షించుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, మహిళా శిశుసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.ఆర్‌.అనూరాధ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ తదితరులు హాజరయ్యారు.

రెండో విడత నాడు–నేడు పనులు వెంటనే మొదలు పెట్టాలి 
విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఒక్క స్కూలునూ మూసేయకూడదని, ఒక్క టీచర్‌నూ తొలగించకూడదని చెప్పారు. ప్రతి స్కూలూ నడవాలన్నారు. ఈ వారంలో ప్రతిపాదనలను ఖరారుచేయాలని సూచించారు. నాడు–నేడు రెండోవిడత పనులను వెంటనే మొదలుపెట్టాలన్నారు. నాడు–నేడు రెండో విడత పనుల్ని ఆగస్టులో ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు