సామాజిక న్యాయ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం: సీఎం వైఎస్‌ జగన్‌

25 Aug, 2022 12:47 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: ఈ దేశ స్వాతంత్ర సమరాన్ని ఒక మగ్గం మార్చేసిందని, అలాంటిది మగ్గం నేసే నేతన్నలకు అండగా తమ ప్రభుత్వం నిలబడుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాలకూ ప్రాధాన్యత ద్వారా సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం జగన్‌ తెలిపారు. గురువారం పెడన వద్ద వైఎస్సార్‌ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 

గతంలో ఏ ప్రభుత్వం చేనేత రంగానికి అండగా నిలవలేదని, నేతన్నల జీవితాలను తన పాదయాత్రలో గమనించా గనుకే అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చానని సీఎం జగన్‌ చెప్పారు.  ఇప్పటివరకు వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధిదారులకు రూ. 776.13 కోట్లు సాయం అందించామని ఆయన గుర్తు చేశారు.  ఈ నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి ఏడాది రూ.24 వేల చొప్పున.. ఇప్పటిదాకా రూ.96 వేలు సాయం అందించామని, లంచాలకు అవకాశం లేకుండా నేరుగా ప్రభుత్వ సాయం అందిస్తున్నామని ఆయన అన్నారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ నేతన్న పథకం ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతోందని, ఇప్పటివరకు నేతన్నల సంక్షేమం కోసం రూ.2,049 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా సాయం అందించలేదని సీఎం జగన్‌ తెలిపారు.

 

ఇంకా ఆయన ఏమన్నారంటే.. 
ఈ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఈ-కామర్స్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్నాం. ఇవాళ 80, 546 మంది  నేతన్నలకు రూ.193.31 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క చేనేత మాత్రమే కాదు.. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నాం. చంద్రబాబు పవర్‌లో ఉన్నప్పుడు ఒకే వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసిన ప్రభుత్వం మాది. కేబినెట్‌లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. మూడేళ్లలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపాం. శాసన మండలి సీట్లను బడుగు, బలహీన వర్గాలకే ఇచ్చాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశామని సీఎం జగన్‌ తెలిపారు.

ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడి కోసమే గత ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేశారని, గతంలో దోచుకో, తినుకో, పంచుకో పథకం నడిచిందని ఎద్దేవా చేశారు సీఎం జగన్‌.  తప్పుడు విమర్శలు చేయడమే ఇప్పుడు వాళ్లు పనిగా పెట్టుకుంటున్నారని, జరుగుతున్న మంచిని ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్‌. అన్ని వర్గాలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించామన్న ఆయన.. ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు