దేవిక కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్‌

9 Oct, 2022 08:45 IST|Sakshi

సాక్షి, అమరావతి/కరప : కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల కూరాడ గ్రామంలో హత్యకు గురైన దేవిక కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆమె  కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. దేవిక హత్య ఘటనపై ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్‌.. దిశ చట్టంలో పేర్కొన్న విధంగా త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేసి, నిర్ణీత సమయంలోగా ఛార్జిషీటు దాఖలు చేయాలని చెప్పారు.

దోషి రెడ్‌ హేండెడ్‌గా పట్టుబడ్డ కేసుల విషయంలో దిశ చట్టంలోని మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని, తద్వారా నేరం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రూ.10 లక్షల సాయాన్ని దేవిక కుటుంబ సభ్యులకు రెండు రోజుల్లో అందజేస్తారని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం కరపలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని కూరాడ సర్పంచ్‌ వాసంశెట్టి వెంకటరమణ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రావుల ప్రసాద్, ఇతర నాయకులకు వివరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.    

న్యాయమూర్తి ఎదుట హాజరు 
ప్రేమను నిరాకరించిందన్న కక్షతో యువతి కాదా దేవికను హత్య చేసిన నిందితుడు గుబ్బల వెంకట సూర్యనారాయణను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరు పరచి, రిమాండ్‌కు తరలించారు. కాకినాడ రూరల్‌ సీఐ కె.శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం గంగవరం గ్రామానికి చెందిన కాదా రాంబాబు కుమార్తె దేవిక.. కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ డిగ్రీ చదువుకుంటోంది.

అదే గ్రామంలో మేనమామ ఇంటి వద్ద ఉండే గుబ్బల వెంకట సూర్యనారాయణ అనే యువకుడు తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఏడాది కాలంగా దేవికను వేధిస్తున్నాడు. అందుకు నిరాకరించిందన్న అక్కసుతో శనివారం ఆమెను పెదపూడి మండలం కాండ్రేగుల–కూరాడ గ్రామాల మధ్య కత్తితో అతి దారుణంగా నరికి హతమార్చిన విషయం విదితమే. నిందితుడు వెంకట సూర్యనారాయణను కాకినాడ రూరల్‌ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో కాకినాడ రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.ప్రసన్నలక్ష్మి నివాసంలో ఆమె ఎదుట హాజరు పరిచారు. నిందితుడికి ఈ నెల 21వ తేదీ వరకూ రిమాండ్‌ విధించగా, అతడిని కాకినాడ సబ్‌ జైలుకు  తరలించారు.   

చదవండి: (కాకినాడ జిల్లాలో దారుణం.. ప్రేమను నిరాకరించిందని..)

మరిన్ని వార్తలు