మూడు రాజధానులకు మోకాలడ్డు 

10 Jul, 2022 04:06 IST|Sakshi

బాబు అండ్‌ కో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దెబ్బ తింటుందని కుట్రలు

వైఎస్సార్‌సీపీ ప్లీనరీ ముగింపు సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌  

గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలు కాలేవు  

అమ్మ ఒడి బూటకమట.. విద్యా దీవెన నాటకమట.. 

ఎల్లో మీడియా కుట్రలను తిప్పికొట్టండి 

175కు 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేయండి 

ఎల్లో పేపర్లు, ఎల్లో టీవీలు, ఎల్లో సోషల్‌ మీడియా రాసినంత మాత్రాన, చూపినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు. గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలు అయిపోవు. గ్రామ సింహాలన్నీ తమ బాబు మంచి చేశాడని చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి. మనం ఇంటింటికీ ఈ మూడేళ్లలో చేసిన మంచిని చూపిస్తుంటే గ్రామ సింహాలు తట్టుకోలేకపోతున్నాయి. మనం బటన్‌ నొక్కి ప్రజలకు నేరుగా లబ్ధి కలిగిస్తుంటే.. వాళ్ల బాబుకు డిపాజిట్లు కూడా దక్కవు అనే భయంతో, దురుద్దేశంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని రోజూ అరుస్తున్నాయి. బాబు హయాంలో రాష్ట్రం ఏమైనా అమెరికా అయ్యిందా? 

వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి :  ‘రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరిగేలా మూడు రాజధానులు ఇస్తామంటున్నాం. అందులో అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామన్నాం. కానీ చంద్రబాబు అండ్‌ కో, దుష్టచతుష్టయం  కొనుగోలు చేసిన బినామీ భూముల రేట్ల కోసం అడ్డుపడుతున్నారు. ఇదీ టీడీపీకి, దుష్టచతుష్టయానికి తెలిసిన ప్రాంతీయ న్యాయం’ అని వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. శనివారం ఆయన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ ముగింపు సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఉన్నాయి. మూడు ప్రాంతాల ప్రజలకు ఆత్మగౌరవం ఉంది. మన రాష్ట్రంలో మరోసారి ఎలాంటి ఉద్యమాలు రాకుండా, అన్యాయం జరిగిందనే వాదనలకు అవకాశం ఇవ్వకుండా మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తున్నాం. ఇలా చేస్తే బాబు అండ్‌ కో వారి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి దెబ్బ పడుతుందని కుట్రలకు తెర లేపారు’ అన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకిస్తారా! 
రాష్ట్రంలో 75 ఏళ్లలో కేవలం రెండు జిల్లాలు మాత్రమే అదనంగా ఏర్పడితే.. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసి.. మొత్తంగా 26 జిల్లాలను చేశాం. అందులో ఒక జిల్లాకు మన రాజ్యాంగ నిర్మాత, దళిత శిఖరం అంబేడ్కర్‌ పేరు పెట్టినందుకు ఏకంగా ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లను తగులబెట్టించిన దుర్మార్గం చంద్రబాబుది, ఆయన దత్తపుత్రుడిది. 

పగటి కలలు కంటున్నారు 
అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న పథకాలకు డబ్బు పుట్టేందుకు వీల్లేదని వీరంతా ఒక్కటయ్యారు. సంక్షేమ పథకాలన్నీ ఆపేయాలని తెలుగుదేశం పార్టీ గజెట్‌ పేపర్‌ ఈనాడు.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వక్రీకరించి చెప్పింది. అమ్మ ఒడి బూటకం, విద్యా దీవెన నాటకం అని వీటన్నింటినీ ఎత్తేసేందుకు స్కెచ్‌లు కూడా గీస్తున్నారు. వీళ్లను ఎవరో నమ్మినట్టుగా.. అధికారంలోకి వస్తారని పగటి కలలు కంటున్నారు. 

ఎన్నికలకు సన్నద్ధం కండి  
వార్డు, గ్రామ, మండల, నియోజకవర్గ, బూత్‌ కమిటీలు కూడా గడువులోగా పూర్తి చేయండి. ఎన్నికలకు సన్నద్ధం కండి. ప్రజలు ఏమైనా సమస్యలు చెబితే వెంటనే పరిష్కరించేలా పార్టీ నాయకత్వంతో కోఆర్డినేట్‌ చేసుకుంటూ కార్యకర్తలు, అభిమానులు చొరవ చూపాలి.  మారుతున్న మన గ్రామాన్ని చూపించండి.. వారితో కలిసి వివరించండి.   

సోషల్‌ మీడియా సైన్యాన్ని తయారు చేయాలి 
బూత్‌ కమిటీల్లో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 50 శాతం ఉండేలా.. అందులో 50 శాతం అక్కచెల్లెమ్మలు ఉండేలా చూడండి. టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారాలు, దుష్టచతుష్టయం పన్నాగాలను తిప్పికొట్టేలా ప్రతి గ్రామంలోనూ సోషల్‌ మీడియా సైన్యాన్ని తయారు చేయండి.  

మీ భవిష్యత్‌ బాధ్యత నాదీ 
మీ తోడు, మీ అండ నన్ను ఇంతటి వాడిని చేశాయి. అలాంటి కార్యకర్తలకు ఈ రోజు ఒక్కటే చెబుతున్నా.. ఈ పార్టీ మీది. జగన్‌ మీ వాడు. అని జగన్‌ అనే నేను చెబుతున్నా.. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు, కార్యకర్తల భవిష్యత్తుకు నాదీ బాధ్యత. మీ కష్టాల్లో, సుఖాల్లో పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మరింత ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలి.

175 సీట్లు సుసాధ్యమే 
► ఈ దుష్టచతుష్టయం రేపు ఎన్నికల కోసం దుర్బుద్ధితో దొంగ వాగ్దానాలు చేస్తారని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 
► మన కార్యకర్తలు,అభిమానులు, మన సంక్షేమ పథకాలు అందుకుంటున్న కుటుంబ సభ్యులే మన సైన్యం. ఇంటింటికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ఎలా అందిస్తున్నామో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు ఇంటింటా వివరిస్తున్నారు. ప్రతి ఇంటికి అందిన ప్రయోజనాలను లెటర్ల రూపంలో చూపిస్తున్నారు. 
► ఈ కార్యక్రమంలో ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త, ప్రతి వలంటీర్‌ మమేకం కావాలి. మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడదామని చెప్పండి 
► మీ అండదండలు, దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు 175కు 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేద్దాం. ఇది అసాధ్యం కానే కాదు.  ఎందుకంటే చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం ప్రజలు కూడా మనం చేసిన మంచిని గుర్తించి స్థానిక ఎన్నికల్లో మనల్ని గెలిపించారు.   

మరిన్ని వార్తలు