మీరే నా సైన్యం: సీఎం జగన్‌

24 Jan, 2024 01:49 IST|Sakshi
అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన వైఎస్సార్‌ ఆసరా నిధుల జమ సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం

మన ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కచెల్లెమ్మలే నా స్టార్‌ క్యాంపెయినర్లు

మన ప్రభుత్వ చేయూత, ఆసరాతో మహిళా సాధికారత 

వారు బాగుంటేనే ఇల్లు, రాష్ట్రం బాగుంటుంది

అందుకే వారికి అన్ని విధాలా అండగా నిలిచాం

నాలుగో విడత ‘ఆసరా’ నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్‌ 

ఈ పథకం కింద 79 లక్షల మందికి రూ.25,571 కోట్ల 

డ్వాక్రా రుణాలు చెల్లించాం.. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.4,968 కోట్లు ఇచ్చాం

మొత్తంగా రూ.31 వేల కోట్లు అందించాం

56 నెలల్లో ఏకంగా నేరుగా రూ.2.53 లక్షల కోట్లు లబ్ధి

అర్హతే ప్రాతిపదికగా రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాల అమలు 

మన ప్రభుత్వంలో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు

ప్రస్తుతం 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనిపించనంత తేడా ఏపీలో కనిపిస్తోంది

ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలను మోసం చేసిన వారికి ఇంత మంది స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్‌ క్యాంపెయినర్లు లేరు. అయితే మీ బిడ్డ వాళ్లెవరినీ నమ్ముకోలేదు. వీళ్లందరి కంటే ఎక్కువగా నాకు స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారని గట్టిగా చెబుతున్నాను. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కచెల్లెమ్మలే నా స్టార్‌ క్యాంపెయినర్లు. జెండాలు జత కట్టడమే టీడీపీ అజెండా. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్‌ అజెండా. 

మహిళా సాధికారతను బాధ్యతగా భావించాం. అక్కచెల్లెమ్మలపై మమకారంతో 56 నెలల్లో మన ప్రభుత్వం ఒక్క ఆసరా పథకానికే ఏకంగా రూ.25,570 కోట్లు ఇచ్చామని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఎక్కడైనా దేశం, రాష్ట్రం బాగుందని చెప్పడానికి అక్కడ అక్కచెల్లెమ్మల బాగోగులు, వాళ్ల పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్, అక్షరాస్యత పెరుగుదల, వారి ఆదాయంలో వృద్ధి, రాజకీయంగా వాటా.. తదితర అంశాలను పారామీటర్స్‌గా చూడాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నింటిలో ఎక్కడైతే అక్కచెల్లెమ్మలు ముందంజలో ఉంటారో అప్పుడు ఆ రాష్ట్రం కూడా ముందంజలో ఉంటుంది. ఇవాళ ఈ దిశగా మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండటం సంతోషంగా ఉంది.  
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

సాక్షి, అనంతపురం (ఉరవకొండ): ‘ఎక్కడా కులం, మతం, ప్రాంతం, వర్గం.. చివరకు ఏ పార్టీ అని చూడకుండా, ఓటు వేయకపోయినా పర్వాలేదు.. అర్హతే ప్రామాణికంగా లబ్ధి చేకూరుస్తున్నాం. అక్కచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం బాగుంటుందని మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం. మన ప్రభుత్వం అందించిన చేయూత, ఆసరా వల్ల వారంతా సొంత కాళ్లపై నిలబడ్డారు. ఇతర రాష్ట్రాల వారికి ఆదర్శంగా నిలిచారు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం ఆయన వైఎస్సార్‌ ఆసరా పథకం కింద నాలుగో విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి సుమారు 79 లక్షల మంది పొదుపు మహిళల ఖాతాల్లో రూ.6,394.83 కోట్లు జమ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మన ప్రభుత్వం అండగా ఉందన్నారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, తీరా గద్దెనెక్కాక మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేశాడని మండిపడ్డారు. 2016 అక్టోబర్‌ నుంచి అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశారన్నారు. చంద్రబాబు చర్యలతో అప్పట్లో పొదుపు సంఘాల రుణాలు తడిసి మోపెడయ్యి వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకునే పరిస్థితి వచి్చందని చెప్పారు.

చంద్రబాబు మోసానికి ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌ సంఘాలు కూడా కిందకు పడిపోయాయని గుర్తు చేశారు. మనందరి ప్రభుత్వం రాగానే 2019 ఎన్నికల నాటికి ఉన్న అప్పులన్నింటినీ మాఫీ చేస్తామని చెప్పామని, ఆ మాట మేరకు నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన వైఎస్సార్‌ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ పూర్తి చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే మూడు దఫాల్లో రూ.19,176 కోట్లు ఇచ్చామని, ఇవాళ నాలుగో విడతగా ఇస్తున్న రూ.6,394.83 కోట్లతో కలిపి రూ.25,570 కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఎక్కడా లంచాలు, వివక్షకు తావే లేదన్నారు. ఈ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

 గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలే 
► గత 56 నెలల్లో అక్కచెల్లెమ్మల చెయ్యి పట్టుకుని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద కోటి ఐదు లక్షల మందికి రూ.4,690 కోట్లు నేరుగా ఇచ్చాం. వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ ఆసరా కింద ఇచ్చిన రూ.31 వేల కోట్లతో కలిపి మొత్తంగా రూ.2.53 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. గతంలో ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీ మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా లంచాలు పోయేవి. ఈ రోజు మన పారీ్టకి ఓటు వేయకపోయినా ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. 

► అక్కచెల్లెమ్మలపై ఇంత బాధ్యతగా, మమకారం చూపుతున్న ప్రభుత్వం మనదే. అమ్మ ఒడి పథకం కింద రూ.26,067 కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 31.27 లక్షల మంది మహిళలకు రూ.14,129 కోట్లు అందజేశాం. మరో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాం. నిర్మాణం పూర్తయిన ఒక్కో ఇంటి విలువ రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది. 25.45 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుస్తూ.. వారి పిల్లలకు విద్యా దీవెన కింద రూ.11,900 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద మరో రూ.4,275 కోట్లు అందించాం. కాపు నేస్తం కింద రూ.2,028 కోట్లు, ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు అందించాం. 

► పేదల పింఛన్‌ 64.30 లక్షల మంది అందుకుంటున్నారు. ఏ ఒక్కరూ రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేకుండా ప్రతి నెలా ఒకటవ తేదీన ఉదయాన్నే గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ చిరునవ్వుతో వలంటీర్‌ ఇంటికి వచ్చి పింఛన్‌ సొమ్ము చేతుల్లో పెడుతున్నారు. 56 నెలల్లో పింఛన్ల కోసం రూ.84,730 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో రూ.56 వేల కోట్లు కేవలం నా అవ్వలు, అక్కచెల్లెమ్మలకే ఖర్చు చేశామని చెప్పడానికి సంతోషపడుతున్నా. 
► చిరు వ్యాపారాలు చేసుకుంటున్న నా అక్కచెల్లెమ్మలకు జగనన్న తోడు ద్వారా వడ్డీ లేని రుణాలు రూ.2610 కోట్లు, చేదోడు ద్వారా రూ.404 కోట్లు ఖర్చు చేశాం. 

ఇవాళ 99 శాతం రుణాల రికవరీ 
► రాష్ట్రంలో వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చే­యూ­త, అమ్మ ఒడి, వైఎస్సార్‌ సున్నా వడ్డీ కార్యక్రమాల ద్వారా ఎంత మంచి జరిగిందని ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు 2014కు ముందు రుణాలు మాఫీ చేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. గెలిచిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు. రుణమాఫీ మాట గాలికి వదిలేశారు. సున్నా వడ్డీని రద్దు చేశారు. అప్పట్లో రూ.14,210 కోట్ల రుణాలు తడిసి మోపెడై వడ్డీలు, చక్రవడ్డీలుగా మారాయి. చంద్రబాబు మోసాలతో పొదుపు సంఘాలు ఏ, బీ గ్రేడ్‌ నుంచి సీ, డీ గ్రేడ్‌లకు పడిపోయాయి. ఎన్‌పీఏలు, అవుట్‌ స్టాండింగ్‌లో 19 శాతానికి పడిపోయాయి.  

► ఈ రోజు మీ బిడ్డ పాలనలో అవే సంఘాలు తలెత్తుకుని నిలబడ్డాయి. రుణాల రికవరీ 99 శాతంతో పొదుపు సంఘాలు మెరుగ్గా ఉన్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారతకు మన ప్రభుత్వం ఎంతగా నిలబడిందో గమనించండి. ఎప్పుడూ లేని విధంగా అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఏకంగా చట్టం చేశాం. ప్రతి సచివాలయంలో మహిళా పోలీసును ఏర్పాటు చేశాం. దిశ యాప్‌ తీసుకువచ్చాం. కోటి 40 లక్షల మంది అక్కచెల్లెమ్మల సెల్‌ఫోన్లలో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్‌ అండగా, రక్షణగా నిలిచింది.  

గతంలో ఇవన్నీ ఎందుకు లేవు? 
► ఇన్ని కార్యక్రమాలు గతంలో ఎందుకు లేవు? అక్కచెల్లెమ్మలను పట్టించుకున్న నాథుడే లేడు. వారి పిల్లల చదువుల గురించి ఎవరైనా పట్టించుకున్నారా? గతంలో కూడా ఒక పాలన ఉండేది. అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల గ్రోత్‌ రేట్‌ చూస్తే మీ బిడ్డ ప్రభుత్వంలో గ్రోత్‌ రేట్‌ తక్కువ. గతంలో దోచుకో.. పంచుకో.. తినుకో.. ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బటన్‌ నొక్కుతున్నాడు.. నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఎవరూ లంచాలు అడగడం లేదు.  

► వైఎస్సార్‌ ఆసరా నాలుగవ విడత కార్యక్రమాన్ని 14 రోజుల పాటు (ఫిబ్రవరి 5 వరకు) పండుగ వాతావరణంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల మధ్య నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. గ్రామ సచివాలయాల్లో అక్కచెల్లెమ్మలకు మైక్‌లు ఇచ్చి ఏ రకంగా మహిళా సాధికారత జరిగిందన్న కథలు రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా వినిపించాలి. 

రాష్ట్రంలో జగన్‌ ప్రభంజనం 
రాష్ట్రంలో మరోసారి జగన్‌ ప్రభంజనం ఖాయం. మహిళలు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. గతంలో ఒక ఎస్సీ కుర్రాడికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇవ్వడానికి టీడీపీ కండువా కప్పుకోవాలని పయ్యావుల కేశవ్‌ సోదరుడు బలవంతం చేశాడు. మన ప్రభుత్వంలో అలా ఎప్పుడూ జరగలేదు. పచ్చ కండువా వేసుకున్నా, ఎర్ర కండువా వేసుకున్నా అర్హత ఉంటే చాలు పథకాలు ఇస్తున్నాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన వారిలో కొందరిని ప్రలోభపెట్టి పచ్చ కండువా వేసి ఆహా్వనించారు. ఇప్పుడు మేము అదే పని చేసి ఉంటే.. పయ్యావుల కేశవ్‌తో సహా ఒక్క ఎమ్మెల్యే అయినా మీ వెంట ఉండేవారా చంద్రబాబూ? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఇన్‌­పుట్‌ సబ్సిడీపై మాట్లాడగా.. ఆ బకాయి కిరణ్‌ ప్రభుత్వానిది కాబట్టి ఇచ్చేది లేదని చెప్పిన దుర్మార్గుడు చంద్రబాబు. అదే వైఎస్‌ జగన్‌రూ.25 వేల కోట్లకు పైగా పొదుపు సంఘాల బకాయిలు చెల్లించడం చరిత్రాత్మకం. 
– వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త   

పుట్టింటికంటే ఎక్కువ ఇచ్చారు
అన్నా.. మీరు ఆడపడుచులకు పుట్టింటి కంటే ఎక్కువ ఇచ్చారు. వైఎస్సార్‌ ఆసరా మాకు చాలా సాయం చేసింది. మేం చాలా సంతోíÙస్తున్నాం. మీరు పాదయాత్రలో ఇచి్చన మాట ప్రకారం మాకు సాయం చేశారు. వైఎస్సార్‌ ఆసరా ద్వారా రూ.30 వేలు లబ్ధి పొందాను. ఈ డబ్బుతో ఫ్యాన్సీ షాప్‌ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గతంలో మా పొదుపు సంఘాలు అప్పులు కట్టలేక నిలిచిపోయాయి. ఈ రోజు మీ మేలు వల్ల ఏ బ్యాంకైనా వెంటనే పిలిచి మరీ లోన్లు ఇస్తున్నాయి. మా ఇద్దరు పిల్లల చదువులు, ఇంటి స్థలం, నా భర్తకు లక్షల విలువయ్యే వైద్యం.. ఆ తర్వాత విశ్రాంతి సమయంలో కూడా సాయం.. ఇలా ఎన్నో విధాలుగా అండగా నిలిచారు. మీకు రుణపడి ఉంటాం.  
– మమత, పొదుపు సంఘం సభ్యురాలు, వజ్రకరూరు, అనంతపురం జిల్లా  

>
మరిన్ని వార్తలు