YS Jagan: అభివృద్ధిలో టాప్‌గేర్‌

10 Jul, 2021 02:16 IST|Sakshi
 వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ మైదానంలో బ్యాటింగ్‌ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

బద్వేలు, కడప రూపురేఖలు మారుస్తాం.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

బద్వేలులో రూ.500 కోట్లతో, కడపలో రూ.459 కోట్లతో పనులు

బ్రహ్మంసాగర్‌లో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేస్తాం

రూ.46.68 కోట్లతో లీకేజీ అరికట్టేందుకు మరమ్మతులు 

కుందూ నదిపై ప్రాజెక్టు పనులకు రూ.564.60 కోట్లతో శ్రీకారం 

రూ.25 కోట్లతో పోరుమామిళ్లలో రోడ్డు విస్తరణ.. సగిలేరు నదిపై రూ. 39.5 కోట్లతో రెండు వంతెనలు

రెవెన్యూ డివిజన్‌గా బద్వేలు.. ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు 

భవిష్యత్‌లో మంచి నగరాల జాబితాలో కడప

సాక్షి, కడప: వెనుకబడిన ప్రాంతమైన వైఎస్సార్‌ జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులతో బద్వేలు, కడప రూపురేఖలు మారుస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వైఎస్సార్‌ జిల్లా బద్వేలు, కడపలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తొలుత బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల బైపాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గాల్లో బద్వేలు ఒకటన్నారు. తాను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నప్పుడు, దివంగత ప్రియతమ నేత నాన్న గారి హయాంలో మాత్రమే ఈ నియోజకవర్గానికి మంచి జరిగిన పరిస్థితి కనిపించిందని చెప్పారు. అప్పట్లో బ్రహ్మంసాగర్‌లో 14 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేశారన్నారు. ఆ తర్వాత నాలుగైదు టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయలేదన్నారు. పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడం, మంచి చేయాలనే తపన లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. 

బ్యాట్‌ పట్టి.. షాట్‌ కొట్టి.. 
కడప అర్బన్‌ / స్పోర్ట్స్‌: తాత వైఎస్‌ రాజారెడ్డి పేరుతో తండ్రి నిర్మించిన స్టేడియంలో మనవడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బ్యాట్‌ పట్టుకుని బరిలోకి దిగారు. చూడముచ్చటైన షాట్‌లతో అలరించారు. ఈ అద్భుతమైన సన్నివేశం కడప నగరంలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ మైదానంలో చోటుచేసుకుంది. ఈ మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఆవిష్కరణ, రూ.4 కోట్లతో ఫ్లడ్‌లైట్‌ల నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం సీఎం జగన్‌ బ్యాట్‌ పట్టుకుని క్రీజ్‌లో నిలుచున్నారు. తొలుత కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి బంతిని తిన్నగా వేయగా.. నిబంధనల మేరకు వికెట్‌ వైపు నుంచే బంతిని వేయాలని సూచించారు. దీంతో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడిన వేణుగోపాల్, మధుసూదన్‌లు బౌలింగ్‌ చేయడంతో సీఎం జగన్‌ బ్యాట్‌ ఝుళిపించారు.  అనంతరం ఆంధ్రా క్రికెట్‌ సంఘం ప్రతినిధులతో గ్రూప్‌ ఫొటో దిగారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.   

బ్రహ్మంసాగర్‌ ఎప్పుడూ నిండుకుండలా ఉండాలి
దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో రెండేళ్లుగా ఇదే బ్రహ్మంసాగర్‌ నిండు కుండలా ఉందని సీఎం జగన్‌ అన్నారు. ఎప్పుడూ ఇలానే ఉండాలనే ఉద్దేశంతో ప్రాజెక్టుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులను తీర్చేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. గత పాలకుల హయాంలో వెలుగోడు ప్రాజెక్టు 0–18 కిలోమీటర్ల వరకు కెనాల్‌ లైనింగ్‌ పనులను పట్టించుకోలేదన్నారు. దీంతో నీళ్లు కిందకు రాని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ పరిస్థితి మారిస్తే తప్ప బ్రహ్మంసాగర్‌కు సెక్యూరిటీ ఉండదని భావించి రూ.300 కోట్లు మంజూరు చేసి, లైనింగ్‌ పనులు ప్రారంభించి దాదాపు 80 శాతం పూర్తి చేశామన్నారు. దేవుడు ఆశీర్వదిస్తే అక్టోబర్‌ నాటికి లైనింగ్‌ పూర్తయి, నీళ్లు నేరుగా బ్రహ్మంసాగర్‌కు వచ్చేలా చూస్తామని చెప్పారు.  బ్రహ్మంసాగర్‌ ఎప్పుడూ నిండు కుండలా ఉండాలని భావించి, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కుందూ నది మీద లిఫ్ట్‌ ప్రాజెక్టు పనులకు రూ.564.60 కోట్లతో శ్రీకారం చుట్టామని తెలిపారు. రెండేళ్లలో పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..


పోరుమామిళ్ల బైపాస్‌ రోడ్డులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రూ..500 కోట్లతో అభివృద్ధి పనులు  
బద్వేలు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి రూ.500 కోట్లతో పనులు చేస్తున్నాం. దీంతో నియోజకవర్గం రూపురేఖలు మారతాయి. బద్వేలు పట్టణంలో రూ.130.60 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు శ్రీకారం చుట్టాం. పట్టణంలో సుమారు 140 కిలోమీటర్ల పొడవుతో కొత్త సీసీ రోడ్లతో పాటు మూడు పార్కులు, కూరగాయలు.. చేపల మార్కెట్, మూడు వాణిజ్య సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ఆరు శ్మశాన వాటికల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. 
రూ.79.67 కోట్లతో దిగువ సగిలేరు ఎడమ ప్రధాన కాలువను 23 కిలోమీటర్ల మేర వెడల్పు చేసే పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. దీని ద్వారా బద్వేలు, బి.కోడూరు మండలాల్లో 35 చెరువులకు ఏటా నీళ్లు నింపుకునే వెసులుబాటు కలుగుతుంది. 
బ్రహ్మంసాగర్‌ ఎడమ, కుడి కాలువలకు సంబంధించి రూ.37.452 కోట్లతో పెండింగ్‌ పనులు చేపడుతున్నాం. తద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించొచ్చు. మరోవైపు బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ ఆనకట్టకు ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ డయాఫ్రం కటాఫ్‌ వాల్‌ నిర్మాణ పనులకు రూ.46.68 కోట్లతో శంకుస్థాపన చేస్తున్నాం. ఇవన్నీ పూర్తయితే జలాశయాన్ని పూర్తి స్థాయిలో నింపొచ్చు.
మనం వచ్చాక పూర్తి స్థాయిలో నీటిని పెట్టడంతో అక్కడక్కడ కొద్దిగా లీకేజీలు కనిపించాయి. వీటిని అరికట్టేందుకు రూ.46.68 కోట్లతో మరమ్మతులు చేస్తున్నాం. దీంతో 17 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఏర్పడుతుంది. 


సభకు హాజరైన ప్రజలు

మూడు ఎత్తిపోతల పథకాలు
రూ.35.90 కోట్లతో బ్రహ్మంసాగర్‌ ఎడమ కాలువలో మూడు ఎత్తిపొతల పథకాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా 8,268 క్యూబిక్‌ మీటర్ల నీటిని సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున ఉన్న ఇటుకలపాడు, సావిశెట్టిపల్లె, కొండ్రాజుపల్లె, వరికుంట్ల, గంగన్నపల్లె చెరువులకు తరలించొచ్చు. తద్వారా కాశినాయన మండలంలోని పలు గ్రామాల్లో 3,500 ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకురాబోతున్నాం.
రూ.పది కోట్ల వ్యయంతో ఐదు గ్రామాలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు సంబంధించి ఐదు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. పోరుమామిళ్ల పట్టణ పరిధిలో 3.6 కిలోమీటర్ల మేర రెండు లేన్ల రోడ్లను నాలుగు లేన్ల రోడ్డుగా రూ.25 కోట్లతో విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తున్నాం.
రూ.20 కోట్లతో సగిలేరు నది మీద వేమలూరు వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. దీంతో 30 గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది. బ్రహ్మణపల్లె సమీపంలో సగిలేరు నదిపై రూ.9.50 కోట్లతో మరో వంతెన నిర్మిస్తున్నాం. దీనివల్ల కలసపాడు మండలంలోని నాలుగు గ్రామాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా రవాణా మెరుగవుతుంది.
బద్వేలు మార్కెట్‌ యార్డులో బద్వేలు, పోరుమామిళ్లలో రెండు వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో రైతుల కోసం రెండు గోదాములను నిర్మించే పనులకు శంకుస్థాపన చేస్తున్నాం.
బద్వేలులో ప్రసన్నవెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ ఆది చెన్నకేశవ దేవాలయంతో పాటు కాశినాయన మండలంలో మరో ఆరు దేవాలయాల అభివృద్ధి పనులకు రూ.4.70 కోట్లతో శంకుస్థాపనలు చేస్తున్నాం.  

ఈ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే
బద్వేలు నియోజకవర్గ వాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆర్డీఓ కార్యాలయాన్ని మంజూరు చేస్తున్నాం. ఇదే విషయాన్ని ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వారి కోరిక మేరకు మంజూరు చేస్తున్నాం.
బద్వేలులో రూ.5 కోట్లతో ఆర్‌అండ్‌బీ బంగ్లా, రూ.15 కోట్లతో పంచాయతీ రాజ్‌ రోడ్లు, ఎంపీడీఓ, తహశీల్దార్, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల కోసం మంజూరు చేస్తున్నాం. బద్వేలు మండలం వీరబల్లి, కొత్త చెరువు ఎత్తిపొతల పథకానికి రూ.50 లక్షలు అందిస్తున్నాం. 
నియోజకవర్గంలో ఇండ్రస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేస్తే ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించే అవకాశాలు మెరుగవుతాయని మాజీ ఎమ్మెల్సీ కోరారు. ఆయన విన్నపం మేరకు మంజూరు చేస్తున్నాం.
కడప జిల్లాకు ఎంత చేసినా తక్కువే. జిల్లా ప్రజలు నన్నెప్పుడూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. మీరిచ్చిన చలువ వల్లనే ఈరోజు నేను రాష్ట్రం వైపు చూడగలుగుతున్నాను. మీ ఆదరణ, ప్రేమ, ఆప్యాయత ఎప్పటికీ మరిచిపోలేను. ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు.


కడపలోని వైఎస్‌ రాజారెడ్డి స్టేడియంలో వైఎస్సార్, రాజారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం జగన్‌ 

ఇక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం
మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలతో ఈ జిల్లాకు మంచి రోజులు వచ్చాయని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగంగా చెప్పారు. నాన్నగారి మరణం తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ కడపలో అభివృద్ధి పనులు చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఇకపై అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మంచి నగరాల జాబితాలో కచ్చితంగా కడప ఉంటుందని భరోసా ఇచ్చారు. రెండో రోజు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్‌ సమీపంలోని మహావీర్‌ సర్కిల్‌లో రోడ్లను ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభనుద్దేశించి మాట్లాడుతూ.. కడప నగరంలో దాదాపు రూ.459.29 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో శంకుస్థాపన చేసిన పనులను కూడా వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు. ఇంకా సీఎం ఏమన్నారంటే.. 

కడపలో అభివృద్ధి పనులు ఇలా..
జిల్లా కేంద్రమైన కడపలో మహావీర్‌ సర్కిల్‌ నుంచి పుట్లంపల్లె వరకు ఆరు వరుసలతో 80 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం.. రైల్వేస్టేషన్‌ నుంచి మహావీర్‌ సర్కిల్‌ వరకు నాలుగు లేన్లతో 60 అడుగుల వెడల్పుతో మరో రోడ్డు.. ఈ రెండు రోడ్లను సుమారు రూ.80 కోట్లకు పైగా వెచ్చించి అద్భుతంగా తీర్చిదిద్ది ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. 
ఇదే తరహాలో కడప నగరంలో మరికొన్ని రోడ్లను విస్తరించాలని సంకల్పించి శంకుస్థాపనలు చేస్తున్నాం. రూ.101 కోట్లతో కృష్ణా సర్కిల్‌ నుంచి దేవుని కడప వరకు రోడ్డును విస్తరిస్తున్నాం. అన్నమయ్య సర్కిల్‌ నుంచి కృష్ణా సర్కిల్‌ మీదుగా గోకుల్‌ సర్కిల్‌ వరకు రూ.74 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశాం.
అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి వై జంక్షన్‌ వరకు విస్తరణకు రూ.62 కోట్లు కేటాయించాం. ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ నుంచి పుట్లంపల్లె వరకు రోడ్డు విస్తరణ పనులను రూ.9.90 కోట్లతో చేపట్టనున్నాం.  

బుగ్గవంక కష్టాలు రాకుండా చర్యలు
బుగ్గవంక వరద కష్టాలు నాకు తెలుసు. నాన్నగారి హయాంలో బుగ్గవంక నుంచి ప్రమాదం లేకుండా ఉండేందుకు ఐదు హైలెవెల్‌ బ్రిడ్జిలు, రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అనంతరం వచ్చిన పాలకులు ఎవరూ పట్టించుకోలేదు. 
మరోసారి బుగ్గవంక వరద పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు రూ. 49.60 కోట్లతో పెండింగ్‌ పనులు పూర్తి చేస్తాం. చెర్లోపల్లె, పుట్లంపల్లె, బుడ్డాయపల్లె, రామనపల్లె చెరువుల సుందరీకరణ పనులను రూ.5.73 కోట్లతో చేపట్టనున్నాం.  
చిన్నపాటి వర్షాలు కురిసినా నగరంలోని ఆర్కే నగర్, తిలక్‌నగర్, మృత్యుంజయకుంట, ఎస్‌బీఐ కాలనీ, ఎన్జీఓ కాలనీ, ఏఎస్‌ఆర్‌ నగర్, గంజికుంట తదితర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా వరద నీటి కాలువల (స్ట్రాంగ్‌ వాటర్‌ డ్రైన్స్‌) నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం.  

సూపర్‌ స్పెషాలిటీగా రిమ్స్‌..
రిమ్స్‌ను సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేలా నిర్ణయించి రూ.125 కోట్లతో వైఎస్సార్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి శిలాఫలకం వేశాం. ఆ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. డాక్టర్‌ వైఎస్సార్‌ మానసిక చికిత్సాలయానికి సంబంధించి సుమారు రూ.40 కోట్లతో పనులను యుద్ధ ప్రాతిపదికన చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం. 
డాక్టర్‌ వైఎస్సార్‌ కేన్సర్‌ కేర్‌ సెంటర్‌కు సంబంధించి టెండరు ప్రక్రియ జరుగుతోంది. కడపలో రాజీవ్‌ మార్గ్‌ పనులు సుమారు రూ.4 కోట్లతో జోరుగా జరుగుతున్నాయి. దేవుని కడప చెరువు సుందరీకరణకు రూ.55 కోట్లు కేటాయించాం. ప్రస్తుతం రివర్స్‌ టెండరింగ్‌ దశలో ఉంది. నెల రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసుకుని అద్భుత నిర్మాణాలకు శ్రీకారం చుడతాం.
కడప, బద్వేలు కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్,  కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, కడప నగర మేయర్‌ సురేష్‌బాబు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.


సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో తామ్రపత్రాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఆదర్శనీయుడు బ్రౌన్‌
కడప కల్చరల్‌ : తెలుగు భాషాసాహిత్యాన్ని కాపాడిన ఆంగ్లేయుడు, తెలుగుభాషాభిమాని చార్లెస్‌ ఫిలిఫ్‌ బ్రౌన్‌ తెలుగు భాషాసాహితీ వేత్తలకు ఆదర్శనీయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ కేంద్రం ఆవరణలో జానమద్ది సాహితీ పీఠం మేనేజింగ్‌ ట్రస్టీ, బ్రౌన్‌ గ్రంథాలయ సలహా మండలి సభ్యుడు జానమద్ది విజయభాస్కర్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన బ్రౌన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బ్రౌన్‌ లేని తెలుగు సాహిత్యాన్ని ఊహించుకోలేమని, ఆయన బాషా సాహిత్య సేవలు తరతరాలకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. అనంతరం ఛాయా చిత్ర ప్రదర్శన, తాళపత్ర గ్రంథాలు, రాత పరికరాలు, అరుదైన గ్రంథాలను తిలకించారు. ఈ కేంద్రం విస్తరణలో భాగంగా ప్రముఖ ఆడిటర్‌ సంపత్‌కుమార్‌ కుమార్తె చిత్రకూటం అమృతవల్లి సౌజన్యంతో రూ.5.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన నూతన భవన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమృతవల్లిని సత్కరించారు. బ్రౌన్‌ విగ్రహాన్ని రూపొందించిన జిల్లాకు చెందిన ప్రముఖ శిల్పి గొల్లపల్లి జయన్నను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం బ్రౌన్‌ కేంద్రం బాధ్యులు ముఖ్యమంత్రికి బ్రౌన్‌ గ్రంథాలయ రజతోత్సవ సంచికలను అందజేశారు. 

మరిన్ని వార్తలు