మన పిల్లలు ఎక్కడకు వెళ్లినా.. గెలిచే పరిస్థితి ఉండాలి: సీఎం జగన్‌

10 Feb, 2023 12:05 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు పేదలైన తల్లిదండ్రులకు భారం కాకూడదన్న లక్ష్యంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ‘వైఎస్సార్‌ కల్యాణమస్తు’, ‘వైఎస్సార్‌ షాదీ తోఫా’ పథకాల ఆర్థిక సాయం లబ్ధిదారులకు అందనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అక్టోబరు-డిసెంబర్‌ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెలపాటు సమయం ఇచ్చాము. ఫిబ్రవరిలో వెరిఫికేషన్‌ పూర్తిచేసి ఈరోజు నేరుగా వారికి నగదు జమచేస్తున్నాము. సమాజంలో మార్పు తీసుకువచ్చే దిశగా పథకం అమలుచేస్తున్నాము. ప్రతి సంవత్సరంలో ప్రతీ త్రైమాసికానికి సంబంధించి ఇదే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాము. గొప్ప చదువులతోనే పేదల రాతలు మారుతాయి. ఖర్చుకు వెనుకాడకుండా నిధులు ఖర్చు చేస్తున్నాము. పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.

డ్రాపౌట్‌ రేటు తగ్గించడమే లక్ష్యంగా పథకం అమలు అవుతోంది. ఈ పథకం పొందాలంటే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనసరి. నా చెల్లెమ్మలకు 18 ఏళ్లు, నా తమ్ములకు 21 ఏళ్లుగా నిర్దేశించాము.పెళ్లిళ్ల కోసం కొంతకాలం ఆగొచ్చు కానీ చదువులు ఆగిపోకూడదు. అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుంది. పదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న ఆలోచనతో మనం అడుగులు ముందుకేస్తున్నాము. ప్రపంచంలో పోటీ విపరీతంగా ఉంది. మన పిల్లలు ఎక్కడకు వెళ్లినా.. గెలిచే పరిస్థితి ఉండాలి. 

లంచాలు, వివక్షతకు తావులేకుండా పథకం అమలు చేస్తున్నాము. సమాజంలో మార్పు తీసుకువచ్చే దిశగా పథకం అమలవుతోందన్నారు. గత ప్రభుత్వం బీసీల కులాంతర వివాహాలకు రూ.50వేలు ప్రకటిస్తే.. మన ప్రభుత్వం రూ.75వేలు అందిస్తోంది. మైనారీలకు వాళ్లు రూ.50వేలు ప్రకటిస్తే మనం లక్ష రూపాయలు ఇస్తున్నాము. భవన, ఇతర కార్మికులకు గతంలో రూ.20వేలు అయితే, ఇప్పుడు రూ.40వేలు ఇస్తున్నాము. గతంలో వికలాంగులకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించి వారిని మోసం చేస్తే మన ప్రభుత్వం మాత్రం వారిని ఆదుకుని లక్ష50వేల రూపాయలు అందిస్తోందన్నారు. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు పెళ్లిలు అయిన పిల్లలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు