అప్పుడు ఈ పథకాలు ఎందుకు లేవు? అసలు కారణం చెప్పిన సీఎం జగన్‌

3 Aug, 2022 12:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. చిరు వ్యాపారుల కష్టాలు తన పాదయాత్రలో చూశానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ భారం లేకుండా లక్షల కుటుంబాలను ఆదుకున్నామని సీఎం అన్నారు. బుధవారం ఆయన ‘జగనన్న తోడు’ పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు.
చదవండి: జగనన్న తోడు: నగదు జమ చేసిన సీఎం జగన్‌ 

ఈ సందర్భంగా ఆయన సీఎం మాట్లాడుతూ, చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతి వృత్తుల వారికి వడ్డీకి లేని రుణాలు ఇస్తున్నామన్నారు. జగనన్న తోడు సాయం పొందుతున్న వారిలో 80 శాతం మహిళలేనని సీఎం జగన్‌ అన్నారు. మహిళా సాధికారితకు, సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనమన్నారు. మన పాలనలో డీబీటీ.. డైరెక్ట్‌ బెన్‌ఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ అమలవుతోందన్నారు. వివిధ పథకాల ద్వారా నేరుగా రూ.1.65 లక్షల కోట్లు అందించామన్నారు.

సీఎం ఏమన్నారంటే...
స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తున్నాం
తమకు తాము ఉపాధిని ఇవ్వడమే కాకుండా మరి కొంతమందికి కొద్దోగొప్పో ఏదో రూపంలో మిగతా వారికీ ఉపాధినిస్తున్నారు
నామమాత్రపు లాభాలతో చిరు వ్యాపారులు గొప్ప సేవలు అందిస్తున్నారు
వీరు చేసేది వ్యాపారం అనే కన్నా.. గొప్ప సేవ అనడంలో ఏమాత్రం సంకోచించాల్సిన అవసరంలేదు
ఇలాంటి చిరు వ్యాపారులతోపాటు సంప్రదాయ చేతివృత్తులవారికీ ఇస్తున్నాం

వడ్డీ వ్యాపారులమీద ఆధారపడకుండా, అధిక వడ్డీల భారాన్ని మోసే అవసరం లేకుండా వీరికి తోడుగా నిలుస్తున్నాం
వేయి రూపాయలకు రూ.100లు రోజు వడ్డీగా కట్టాల్సిన పరిస్థితులు గురించి నాకు పాదయాత్రలో చెప్పారు
నడ్డి విరిచే వడ్డీల భారాన్ని తప్పించి వీరికి అండగా నిలవడానికి ఈ పథకాన్ని వర్తింపు చేస్తున్నాం
చెప్పిన మాటకు కట్టుబడి జగనన్న తోడు పథకంద్వారా చిరువ్యాపారులు, హస్తకళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారిని వారికాళ్లమీద వారిని నిలబెట్టేలా వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం

దేశవ్యాప్తంగా 34 లక్షలమంది వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులద్వారా తోడ్పాటు పొందితే.. అందులో దాదాపు సగంమందికి మన రాష్ట్రంలోనే రుణాలు పొందుతున్నారు
దీనికి సహకరించిన ప్రతి బ్యాంకుకూ మనస్ఫూర్తిగా కృజ్ఞతలు పొందుతున్నాం
సకాలంలో చెల్లించి రెండోసారి కూడా రుణం తీసుకున్నవారు 5.08 లక్షలమంది ఉన్నారు
వీరిందరి వడ్డీ భారాన్ని ప్రభుత్వంమే భరించింది
ప్రతి ఆరు నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వడ్డీని జమచేస్తున్నాం
రుణం తీరిన తర్వాత తిరిగి రుణం పొందడానికి అర్హులవుతారు
ఒకసారి రుణాన్ని సకాలంలో చెల్లించి మళ్లీ తిరిగి రుణం పొందడానికి అర్హులు, ఇలా రుణం పొందేటప్పుడు రుణం మొత్తాన్ని ప్రతి విడతకూ రూ.వేయి చొప్పున పెంచేదిశగా బ్యాంకులతో మాట్లాడుతున్నాను
సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.48.48 కోట్లు వడ్డీలకింద ప్రభుత్వమే చెల్లించింది

గత ఆరునెలలకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీని బటన్‌ నొక్కి రీయింబర్స్‌ చేస్తున్నాం
నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తున్నాం
జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందినవారిలో 80శాతం మంది అక్క చెల్లెమ్మలే ఉన్నారు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలే మరో 80శాతం మంది ఉన్నారు
ఇది మహిళా సాధికారితకు, సామాజిక న్యాయానికి కూడా నిదర్శనం
గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు
చిరు వ్యాపారులకు తోడుగా నిలవాలన్న ఆలోచన ఏరోజూ కూడా గత ప్రభుత్వంలో చేయలేదు
గత ప్రభుత్వ పాలకులకు మనసు అనేది లేదు కాబట్టి.. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదు

వారిది పెత్తందారీ మనస్తత్వం వారు బాగుంటే చాలు.. దుష్టచతుష్టయానికి మంచి జరిగితే చాలు:
దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్థతి వారిది
ఇప్పుడు మనం డీబీటీ అమలు చేస్తున్నాం
లంచాలకు ఆస్కారం లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తున్నాం
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమచేస్తున్నాం
జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందుతున్న చాలామందికి కూడా మన ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు అందుతున్నాయి
ప్రతి కుటుంబానికీ కనీసం 3-4 పథకాలు అందుతున్నాయి
అప్పుడూ అదే బడ్జెట్‌.. ఇప్పుడూ అదే బడ్జెట్‌..
కాని ఈ పథకాలు గత ప్రభుత్వంలో ఎందుకు లేవు?
అప్పుల్లో చూసినా.. గత ప్రభుత్వంతో పోలిస్తే.. అప్పులు తక్కువే సీఏజీ ప్రకారం
ఇప్పుడు పథకాలు ఎందుకు అందుతున్నాయంటే.. ఎక్కడా లంచాలు లేవు, వివక్షలేదు, అవినీతి లేదు

మరిన్ని వార్తలు