మళ్లీ నాతో పని చేయాలనే అలర్ట్‌ చేస్తున్నా.. ‘గడప గడపకు’ సమీక్షలో సీఎం జగన్‌

28 Sep, 2022 18:59 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జి మంత్రులను ఉద్దేశించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల వద్దకే వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకుని.. సత్వర పరిష్కారం చేయాల్సిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయొద్దని ఆయన గట్టిగానే ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ మేరకు ఈ కార్యక్రమంలో వెనుకబడ్డ 27 మందిని ఆయన సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది.

వారంలో నాలుగు రోజుల చొప్పున.. నెలకు పదహారు రోజులు కూడా తిరగకపోతే ఎలా? అని 27 మంది తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు వాళ్ల పేర్లు చదివి మరీ.. వేగం పెంచాలని వాళ్లకు ఆయన సూచించారు. గంటా రెండు గంటలు తిరగడం కాదు..  ఏడు నుంచి ఎనిమిది గంటలు గ్రామాల్లో తిరగాలి. అదే గ్రామంలో పార్టీ నేతల ఇళ్లలో భోజనాలు చేయాలి. ప్రతి గడపకూ కచ్చితంగా సమయం కేటాయించాలి. డిసెంబర్‌లో మళ్లీ సమీక్ష నిర్వహిస్తా. అప్పటిలోగా అందరూ బాగా తిరగాలి.

మళ్లీ నాతో పని చేయాలనే మిమ్మల్ని అలర్ట్‌ చేస్తున్నా అని పరోక్షంగా వాళ్లను హెచ్చరించారు ఆయన. కుటుంబ సభ్యులు, బంధువులను గడప గడపకులో తిప్పొద్దని, ప్రజా ప్రతినిధులే వెళ్లాలని సమస్యలు గుర్తించి.. వెంటనే పరిష్కారం చేయాలని, అలాగే కేటాయించిన నిధులను వినియోగించుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. ఈ విషయాన్ని ఏపీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి పేర్ని నాని సైతం ధృవీకరించారు.

ఇదీ చదవండి: వరుసగా మూడోసారి నంబర్‌వన్‌: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు