వచ్చే నెల 20వ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్‌

20 Sep, 2023 08:33 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే నెల 20వ తేదీన ఇంద్రకీలాదికి వెళ్లనున్నారు. ఇక, అక్టోబర్‌ 15 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. అక్టోబర్‌ 20న అమ్మవారికి సీఎం జగన్‌ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. 

మరోవైపు.. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సన్నాహాలు జరుగుతున్నాయని సుమారు రూ.7 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ రాంబాబు, ఈవో భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు 10 విశేష అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రూ.2.50 కోట్లతో ఇంజినీరింగ్‌ పనులు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో గతేడాది ఆరు లక్షలకు పైగా భక్తులు అమ్మ వారిని దర్శించుకుంటే ఈ ఏడాది అంతకు మించి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఉత్సవాల్లో 16 లక్షలకు పైగా లడ్డూలను దేవస్థానం అందించిందని, ఈ ఏడాది సుమారు 20 లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.

మూలా నక్షత్రం రోజున రూ.500 వీఐపీ టికెట్లు
ఉత్సవాల్లో ముఖ్యమైన మూలా నక్షత్రం రోజున రూ. 500 వీఐపీ టికెట్లను విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేస్తారని తెలిపారు. రూ.500 వీఐపీ టికెట్‌ తీసుకున్నా ముఖ మండపం దర్శనం మాత్రమే కల్పిస్తామని వివరించారు. మిగిలిన రోజుల్లో రూ. 100, రూ.300, రూ. 500 టికెట్ల విక్రయాలు ఉంటాయన్నారు. ఉత్సవాలకు సుమారు రెండు వందల మంది పని చేస్తున్నారని, భక్తుల తలనీలాలు తీసేందుకు ఇతర ఆలయాలు, బయట నుంచి ఆరు వందల మంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

22న వేదసభ
ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిర్వహించే ఆది దంపతుల నగరోత్సవం మల్లేశ్వరస్వామి ఆలయం మెట్ల వద్ద యాగశాల నుంచి ప్రారంభమవుతుందన్నారు. మహా మండపం, కనకదుర్గనగర్‌, దుర్గాఘాట్‌, దేవస్థాన ఘాట్‌రోడ్డు మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందన్నారు. రాజగోపురం ఎదుట పూజతో నగరోత్సవం ముగుస్తుందన్నారు. 21న అర్చక సభ, 22న వేద సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల్లో చివరి రోజు 23వ తేదీ నుంచి భవానీల రాక ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, మూడు రోజుల పాటు తాకిడి ఉండే అవకాశాలున్నాయన్నారు. సమావేశంలో పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య, బచ్చు మాధవీకృష్ణ, చింకా శ్రీనివాసులు, తొత్తడి వేదకుమారి, వైదిక కమిటీ సభ్యులు యజ్జనారాయణశర్మ, మురళీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

తొలిసారి మహా చండీదేవిగా అమ్మవారు..
ఉత్సవాల్లో తొలిసారిగా అమ్మవారిని మహా చండీదేవిగా అలంకరిస్తామని దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య పేర్కొన్నారు. తొలిరోజున అమ్మవారి శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారన్నారు. 23వ తేదీ రెండు అలంకారాల్లో అమ్మవారిని భక్తులు దర్శించుకోవచ్చునన్నారు. ఉదయం మహిషాసురమర్దని, మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. 23వ తేదీ సాయంత్రం శ్రీ గంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామి వార్లకు పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందన్నారు.

ఇది కూడా చదవండి: తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత..

మరిన్ని వార్తలు