12–14 ఏళ్ల పిల్లలకు నేటి నుంచి టీకా

16 Mar, 2022 03:41 IST|Sakshi

రాష్ట్రంలో 14.90 లక్షల మంది పిల్లలకు టీకా పంపిణీ లక్ష్యం

అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు బుధవారం నుంచి కరోనా టీకా పంపిణీ చేయనున్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో టీకా వేస్తామని అధికారులు చెప్పారు. 14.90  లక్షల మంది పిల్లలకు టీకా వేయనున్నారు. బయోలాజికల్‌ ఇ సంస్థ అభివృద్ధి చేసిన ‘కార్బెవ్యాక్స్‌’ టీకాను పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుంది. తొలి డోసు వేసుకున్న 28 రోజుల అనంతరం రెండో డోసు వేస్తారు. టీకా వేయించుకోవడానికి కోవిన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌కు మంగళవారం నుంచి అవకాశం కల్పించారు. 

15 – 18 ఏళ్లు నిండిన 97 శాతం మందికి టీకా
రాష్ట్రంలో 15–18 ఏళ్ల పిల్లలకు రెండు డోసుల టీకా పంపిణీ 97 శాతం పూర్తయింది. గత జనవరిలో వీరికి టీకా కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రంలో 24.41 లక్షల మందికి టీకా వేయలన్నది లక్ష్యం కాగా, అంతకు మంచి 25.21 లక్షల మందికి తొలి డోసు పంపిణీ పూర్తి చేశారు. వీరిలో 24.33 లక్షల మందికి రెండో డోసు కూడా పూర్తయింది.

ప్రభుత్వాస్పత్రుల్లోనూ రిజిస్ట్రేషన్‌ : ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ హైమావతి
2008 మార్చి 15 నుంచి 2010 మార్చి 15 మధ్య పుట్టిన పిల్లలందరూ ఇప్పుడు టీకాకు అర్హులు. ప్రభుత్వాస్పత్రుల్లోని టీకా కేంద్రాల వద్దే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 15.21 లక్షల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయి. 0.5 ఎంఎల్‌ చొప్పున వేస్తాం. 12 ఏళ్ల లోపు పిల్లలకు టీకా వేయం. టీకా పంపిణీపై జిల్లా వైద్యాధికారులకు మార్గదర్శకాలు ఇచ్చాం.  

మరిన్ని వార్తలు