అక్టోబర్‌ 14 నుంచి విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు

16 Sep, 2022 06:40 IST|Sakshi

సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి 

పలు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం 

సాక్షి, న్యూఢిల్లీ: సీపీఐ 24వ జాతీయ మహాసభలు అక్టోబర్‌ 14 నుంచి 18 వరకు విజయవాడలో నిర్వహించనున్నామని ఆ పార్టీ  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ మహాసభలకు 29 రాష్ట్రాల నుంచి సీపీఐ నాయకులు పాల్గొంటారని, 20 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్ట్‌ పారీ్టల నాయకులు సౌహార్ధ ప్రతినిధులుగా హాజరవుతారని పేర్కొన్నారు.

రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం గురువారం ఢిల్లీ ఏపీ భవన్‌లో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. జాతీయ మహా సభ అజెండాపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించామన్నారు. జాతీయ మహాసభల్లో భాగంగా అక్టోబర్‌ 14వ తేదీ భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంటాయన్నారు. 15న సభకు సీపీఐ నేతలతో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ఎంఎల్, ఫార్వార్డ్‌ బ్లాక్‌ నాయకులు హాజరవుతారని చెప్పారు.

16, 17 తేదీల్లో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంశాలపై సెమినార్‌ జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సెక్యులర్‌ పారీ్టలు, ప్రజాతంత్ర పారీ్టల ముఖ్యమంత్రులు సెమినార్‌కు హాజరవుతారని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌లను ఆహ్వానిస్తామన్నారు.

దేశ తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో రాజకీయాలు ప్రమాదకరంగా తయారయ్యాయని, దేశంలో లౌకికవాదానికి ప్రమాదం ఏర్పడిందని అన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, పాదయాత్ర చేస్తున్న వాళ్లకు సీపీఐ నాయకులు అండగా ఉంటారని తెలిపారు. 

మరిన్ని వార్తలు