‘ముందు జాగ్రత్తలు తీసుకోండి’

2 Dec, 2023 04:54 IST|Sakshi

రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ వీడియో కాన్ఫరెన్స్‌ 

తుపానును ఎదుర్కోవడానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నాం: సీఎస్‌ జవహర్‌రెడ్డి   

సాక్షి, అమరావతి: తుపాను నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ ఆదేశించారు. తుపానును ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయన శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతోపాటు ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాలను కనిష్ట స్థాయికి పరిమితం చేసేలా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాజీవ్‌ గౌబ సూచించారు. 

పూర్తి సన్నద్ధంగా ఉన్నాం..
తుపానును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తలతో పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి వివరించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశామని తెలిపారు. 2 ఎన్డీఆర్‌ఎఫ్, 6 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు.

అలాగే పౌరసరఫరాల విభాగం ద్వారా నిత్యావసర సరుకులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామని వివరించారు.  బలహీనంగా ఉన్న ఏటిగట్లు, వంతెనలు తదితర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.  తుపాను ప్రభావంతో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందన్నారు.

ఈ నెల 4న చెన్నై– మచిలీపట్నం మధ్య తుపాను తీరాన్ని తాకొచ్చన్నారు. ఆ సమయంలో గంటకు 80 నుంచి 100 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరించామన్నారు.

మరిన్ని వార్తలు