బంగాళాఖాతంలో అల్పపీడనం

7 May, 2022 08:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

‘అసాని’ తుపానుగా బలపడే అవకాశం

3 రోజులు రాష్ట్రానికి వర్ష సూచన

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదిలి నేటి (శనివారం) సాయంత్రానికి వాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపానుకు అసాని అని పేరు పెట్టనున్నారు. తుపాను వాయవ్య దిశగా ప్రయాణించి 10వ తేదీన ఉత్తరాంధ్ర–ఒడిశా మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

ఇది బంగ్లాదేశ్‌ వైపు ప్రయాణించే సూచనలు కూడా ఉన్నాయని, అయితే 10వ తేదీన విశాఖపట్నం తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనిప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని  విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, వెళ్లినవారు వెంటనే తిరిగి రావాలని కోరారు.

చదవండి: ఎంపీగా ఉండి కోర్టుకు రావడమేంటి? రఘురామకు హైకోర్టు చీవాట్లు

మరిన్ని వార్తలు