కరిగిపోతూ.. కడలిలో కలసిపోతూ..

6 Dec, 2021 07:43 IST|Sakshi

పిఠాపురం: జవాద్‌ తుపాను ప్రభావంతో కొత్తపల్లి మండల తీర ప్రాంతంలో కడలి కల్లోలం సృష్టించింది. ఎక్కడ చూసినా సుమారు 5 మీటర్ల మేర ముందుకు వచ్చిన సముద్రం తీరప్రాంతాన్ని కబళించింది. పొన్నాడ శివారు కోనపాపపేట తీవ్రంగా కోతకు గురైంది. మత్స్యకారుల ఇళ్లు సుమారు 12 ధ్వంసమయ్యాయి. పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. మరికొన్ని ఇళ్లు ఏ క్షణంలోనైనా సముద్ర కోతకు గురయ్యే ప్రమాదకర పరిస్థితికి చేరాయి.


కోతతో కోనపాపపేటలో సముద్రంలో కలిసిపోతున్న కొబ్బరి చెట్లు

విలువైన కొబ్బరి చెట్లు కడలిలో కలసిపోతున్నాయి. కోతకు గురవుతున్న తమ ఇళ్లలోని సామగ్రిని ఇతర ప్రాంతాలకు తరలించుకునే పనిలో కొందరు మత్స్యకారులు నిమగ్నమయ్యారు. కోతకు గురైన ప్రాంతాలను కొత్తపల్లి ఎంపీపీ కారే సుధ, మత్స్యకార నాయకుడు కారే శ్రీనివాసరావు తదితరులు ఆదివారం పరిశీలించారు. మత్స్యకారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉప్పాడ తీర ప్రాంతం రెండో రోజు కూడా కోతకు గురైంది. పలు ఇళ్లతో పాటు బీచ్‌ రోడ్డు సుమారు కిలోమీటరు మేర ధ్వంసమైంది. శుక్రవారం నిలిపివేసిన రాకపోకలను ఆదివారం పునరుద్ధరించారు. కెరటాల ఉధృతి కొనసాగుతుండడంతో బీచ్‌ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. 


కోతకు గురైన ఇంట్లో భయాందోళనల నడుమ మత్స్యకార కుటుంబం

నేల మాయమై.. బావి మిగిలిందిలా..
కోనపాపపేటలో సముద్ర కోత తీవ్రతకు ఈ బావి సాక్ష్యంగా నిలుస్తోంది. పక్కనే సముద్రం ఉన్నా మంచినీటిని ఇచ్చి ప్రజల అవసరాలను తీర్చిన ఈ నేల బావి.. తీవ్రంగా అలల కోతకు గురైంది. ఫలితంగా చుట్టూ ఉన్న నేల కొట్టుకుపోగా బావి మట్టితో పూడుకుపోయి ఇలా మిగిలింది.

మరిన్ని వార్తలు