అక్కడ ‘ఓటు’ ప్రలోభాలపర్వం  రూ. లక్షకు..!

6 Dec, 2021 07:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూరు: స్థానిక సంస్థల కోటాలో 25 సీట్లకు ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు పడ్డారు. మందు, విందు, చిందులతో తమవైపు తిప్పుకోవడానికి శ్రమిస్తున్నారు. అనేకమంది అభ్యర్థులు టీపీ, జీపీ సభ్యులైన ఓటర్లకు తోటల్లో ఘుమఘమలాడే వంటకాలతో విందు వినోదాలు నిర్వహిస్తున్నారు.

గ్రామ పంచాయతీ సభ్యులు ఏ పార్టీ గుర్తు మీద గెలిచిన వారు కాదు. కాబట్టి వారిపై పార్టీ పర్యవేక్షణ ఉండదు. కొందరు సభ్యులు అన్నిపార్టీల విందులకూ హాజరై మజా చేయడం జరుగుతోంది. అందుకే అభ్యర్థులు విందు, డబ్బులు ఇవ్వడమే కాకుండా తమకే ఓటు వేయాలంటూ ఒట్టు పెట్టించుకుంటున్నారు.  

ఓటుకు రూ.25 వేల ముడుపు  
ధనవంతులైన అభ్యర్థులు రిసార్టులు, హోంస్టేలు, తోటల్లో గత నాలుగైదు రోజులుగా విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. తటస్థంగా ఉండే కొందరికి ఏదో రకంగా ప్రలోభానికి గురిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటుకు రూ. 5 వేల నుంచి రూ. 10  వేల మధ్య ఉన్న ప్రలోభాలపర్వం  ఇప్పుడు రూ. లక్షకు చేరుకుంది.

ఒక్కో నియోజకవర్గంలో ఓటుకు రూ. 25 వేలు డబ్బులు ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఖర్చు పెరిగిపోతోందని అభ్యర్థులు లోలోపల మథనపడుతున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు