జగన్‌ వచ్చాకే దళితులు, గిరిజనులకు రక్షణ

6 Dec, 2023 03:11 IST|Sakshi

చంద్రబాబు హయాంలో నిత్యం ఈ వర్గాల ప్రజలపై దమనకాండ

నాడు సీఎం హోదాలో చంద్రబాబే నీచంగా మాట్లాడిన వైనం

చింతమనేని దాడులు, వర్ల రామయ్య వ్యాఖ్యలూ దళితులు మరవలేదు

దళితులు, గిరిజనులను అక్కున చేర్చుకొన్న సీఎం వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు సంపూర్ణ భద్రత

ఆ కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచేలా పలు కార్యక్రమాలు

నేడు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరుగుతున్న దళితులు, గిరిజనులు

ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు

నాలుగేళ్లలో ఎస్సీ, ఎస్టీలపై తగ్గిన దాడులు, వేధింపులు

బాధితులకు పరిహారం పెంపు.. ఉదారంగా సహాయం

ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడిస్తున్న వాస్తవాలివి

ఆ నివేదికను వక్రీకరిస్తూ ఈనాడు రామోజీ దుష్ప్రచారం

సాక్షి, అమరావతి : ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అంటూ ముఖ్యమంత్రి వంటి అత్యున్నత పదవిలో ఉన్న నారా చంద్రబాబు రాష్ట్రంలోని దళిత జాతిని తూలనాడిన ఘటనను ఈనాడు రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. బాబు హయాంలో రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరిగిన దమనకాండను, టీడీపీ నేతల అవహేళనలను రామోజీ కనీసమాత్రంగానైనా ఖండించలేదు. ఈనాడు పత్రికలో ఒక్క ముక్కా రాయలేదు. అదే దళిత జాతిని, గిరిజనులను, బీసీలను, మైనార్టీలను తన వాళ్లుగా భావించి, వారి అభ్యున్నతికి పాటుపడుతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై అభూత కల్పనలు, అసత్యాలతో కథనాలు రాస్తారు. దళితులు, గిరిజనులపై రామోజీరావు మరోసారి మొసలి కన్నీరు కార్చారు.

రాష్ట్రంలోనే కాదు.. దేశ చరిత్రలోనే విప్లవాత్మక రీతిలో దళిత, గిరిజనులకు సంపూర్ణ భద్రత కల్పించి, వారి సంక్షేమం, అభ్యున్నతికి పాటుపడుతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెగబడ్డారు. జాతీయ నేర గణాంకాల  సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదికను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. కనికట్టు కథనంతో విషం చిమ్మారు. కానీ వాస్తవం ఏమిటో దళితులకు, గిరిజనులకు తెలుసు. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు తమను తూలనాడిన విషయాన్ని మరచిపోలేదు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మహిళా అధికారిపై చేసిన దాష్టీకం వారి కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది.

వర్ల రామయ్య వ్యాఖ్యలూ వారి చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే దగాపడ్డ దళితులు, గిరిజనులను అక్కున చేర్చుకొన్నారు. ఆ కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టారు. సీఎం జగన్‌ ఇచ్చిన చేయూతతో ఈరోజు దళితులు, గిరిజనులు పూర్తి ఆత్మగౌరవంతో దర్జాగా జీవిస్తున్నారు. ఇది వారే చేప్పే వాస్తవం. రామోజీరావుకు మింగుడు పడని విషయమూ ఇదే. అందుకే వక్రీకరించిన కథనాలతో మానసిక సంతృప్తి చెందాలన్న వ్యథలు. రామోజీరావు కథనంలో అన్నీ అసత్యాలేనని తెలిపే వాస్తవాలతో ఫ్యాక్ట్‌ చెక్‌..

బాబు హయాంలో ఫిర్యాదు చేయాలంటేనే హడల్‌
టీడీపీ ప్రభుత్వ హయాంలో బాధిత ఎస్సీ, ఎస్టీలు పోలీసులకు ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోయేవారు. ధైర్యం చేసి బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వస్తే బెదిరించి వెనక్కి పంపించేవారు. ఎందుకంటే అప్పుడు దళితులు, గిరిజనులపై దాడులు చేసిన వారిలో అధిక శాతం టీడీపీ నేతలు, వారి అనుచరులే. అందుకే బడుగు వర్గాల ప్రజలు ఫిర్యాదు చేయడానికి భయపడే పరిస్థితి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పరిస్థితి వేరు. సీఎం వైఎస్‌ జగన్‌ వారిలో భరోసా కల్పించారు. పలు కార్యక్రమాల ద్వారా వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దీంతో వారిపై దాడులు గణనీయంగా తగ్గిపోయాయి.

ఒకవేళ ఎక్కడైనా దాడులు జరిగినా, ఎస్సీ, ఎస్టీలు ధైర్యంగా ఫిర్యాదు చేసే పరిస్థితులను ప్రభుత్వం కల్పించింది. కేసుల సంఖ్య పెరిగినట్టు కనిపించినా పర్వాలేదు.. బాధితులకు న్యాయం జరగాలి.. దోషులకు శిక్షలు పడాలి అనే విధానాన్ని అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వేధింపులకు పాల్పడేవారి పట్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆధారాల సేకరణ కోసం వీడియో కాన్ఫరెన్స్‌ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా 2020 ఆగస్టులోనే ప్రవేశపెట్టింది. ఇవన్నీ సత్ఫలితాలిస్తున్నాయి.

ఎస్సీ, ఎస్టీలపై కేసుల దర్యాప్తులోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపడుతోంది. టీడీపీ హయాంలో 2014 – 2019 మధ్య దర్యాప్తు పూర్తిచేయడానికి సగటున 206 రోజులు పడితే.. ఇప్పుడు ఆ సరాసరి 86 రోజులకు తగ్గింది. టీడీపీ హయాంలో 44 శాతం కేసుల్లోనే చార్‌్జషీట్లు దాఖలు చేస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చార్‌్జషీట్ల నమోదు 73 శాతానికి పెరిగింది. శిక్షలూ గణనీయంగా పెరిగాయి.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో  బాధితులకు మెరుగైన పరిహారం 
దాడులు, వేధింపుల కేసుల్లో బాధితులైన ఎస్సీ, ఎస్టీలను ఆదుకోవడంలో వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. బాధితులకు పరిహారాన్ని భారీగా పెంచింది.  టీడీపీ ప్రభుత్వ హయాంలో దాడులు, వేధింపులకు గురైనవారికి కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిహారాన్ని పంపిణీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అయిదేళ్లలో కేవలం రూ.54.60 కోట్లే బాధితులకు పరిహారంగా ఇచ్చింది. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే మొత్తం రూ.159.30 కోట్లు పరిహారంగా అందించి బాధితులను ఆదుకుంది.

బాబు హయాంలో దమనకాండ.. వైఎస్సార్‌సీపీ హయాంలో భరోసా
చంద్రబాబు ప్రభుత్వ హయాంను ఎస్సీ, ఎస్టీలపై యథేచ్ఛగా సాగిన దమనకాండ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను ఎప్పటికీ వెన్నాడే పీడకలే.  2014–19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో దేశంలోనే ఎస్సీ, ఎస్టీలపై దాడులు అత్యధికంగా జరిగిన టాప్‌–10 రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్‌ కూడా ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై దాడులు గణనీయంగా తగ్గాయి. ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనం..

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆపన్నహస్తం
టీడీపీ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చేవారు. దాంట్లో రూ.1.5 లక్షల్ని అప్పులకు జమ చేసుకుని, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. ఎప్పుడో ఐదేళ్లకో,  పదేళ్లకో ఆ డబ్బును విత్‌ డ్రా చేసుకునే అవకాశం ఉండేది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఆ మొత్తాన్ని ఆత్మహత్యకు పాల్పడిన  రైతు కుటుంబాల ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నారు. వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకునే కౌలుదారుల కుటుంబాలకు కూడా రూ.7 లక్షలు పరిహారం నేరుగా వారి ఖాతాకు జమ చేస్తున్నారు. ఇలా 2019 నుంచి ఇప్పటివరకు 1,270 రైతు కుటుంబాలకు రూ. 88.90 కోట్లు పరిహారం చెల్లించారు.

ఇందులో 485 మంది కౌలు రైతులుండగా, ఆ కుటుంబాలకు రూ.33.95 కోట్లు సాయం అందించారు. 2014 – 19 మధ్య జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపి 474 మందికి రూ.23.70 కోట్లు పరిహారం చెల్లించగా, వీరిలో కూడా 212 మంది కౌలు రైతులున్నారు. వీరికి రూ.10.60 కోట్ల పరిహారం చెల్లించారు. ఈ వాస్తవాలను విస్మరించి రామోజీరావు అసత్యాలతో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. 

>
మరిన్ని వార్తలు